Share News

తుఫాన్‌ నష్టాలను సత్వరమే గుర్తించండి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:15 AM

మొంథా తుఫాన్‌ ప్రభావం వలన జిల్లాలో జరిగిన నష్టాలను తక్షణమే గుర్తించాలని, బాధితులందరికీ ఉచిత రేషన్‌ అందించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

తుఫాన్‌ నష్టాలను సత్వరమే గుర్తించండి
డుంబ్రిగుడలో పర్యటిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

బాధితులకు ఉచిత రేషన్‌ పంపిణీ

నేడు ప్రాథమిక పాఠశాలలకు సెలవు

పాడేరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావం వలన జిల్లాలో జరిగిన నష్టాలను తక్షణమే గుర్తించాలని, బాధితులందరికీ ఉచిత రేషన్‌ అందించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. తుఫాన్‌పై బుధవారం కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో గత రెండు రోజులు ఎంతో శ్రమించిన యంత్రాంగం, మరో రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. తుఫాన్‌ ప్రభావంతో జరిగిన నష్టాలను ఈ రెండు రోజులు పక్కాగా గుర్తించి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పంటల నష్టాలు, విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు, గృహ నష్టాలు, సహాయ పునరావాస కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులు చేపట్టాల్సిన చర్యలను కలెక్టర్‌ వివరించారు. తుఫాన్‌ నష్టాలపై ప్రాథమిక అంచనా వివరాలు సేకరించినప్పటికీ, మరో రెండు రోజుల్లో పక్కాగా సమాచారం సేకరించాలన్నారు. తాజా అంచనా సమాచారం ప్రకారం జిల్లాలో 150 ఎకరాల్లో పంటల నష్టం, 106 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. కానీ వాటి సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. నష్టాలను అంచనా వేసే క్రమంలో పక్కాగా డాక్యుమెంట్‌ చేయాలని, పాత ఫొటోలు, వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ప్రస్తుతం 13 పునరావాస కేంద్రాల్లో 774 మంది ఉన్నారని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో 24 నుంచి 48 గంటలున్న వారిని పక్కాగా గుర్తించి ఒక కుటుంబానికి చెందిన ఒకరికి రూ.వెయ్యి, ఇద్దరుంటే రూ. 2 వేలు, ముగ్గురికిపైబడి ఉన్న వారికి రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 48 గంటల్లో నష్టపరిహారం బాధితులకు అందిస్తామన్నారు. తుఫాన్‌ బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో పంచదార చొప్పున అందిస్తామని చెప్పారు. తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలో అవసరమైన చర్యలు చేపట్టిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ అభినందించారు. అందరి సమష్టి సహకారంతో జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలందించి, నష్టాలు కలగకుండా చూడగలిగామన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం యంత్రాంగం తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని కలెక్టర్‌ పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, యువత సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వారికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. జిల్లాలో గెడ్డలు ఉధృతి తగ్గుముఖం పట్టని కారణంగా గురువారం జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:15 AM