Kidney Disease: ఉద్దానంపై రంగంలోకి ఐసీఎంఆర్
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:39 AM
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలడానికి కారణాలేమిటో అంతుచిక్కడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి పరిశోధనలు చేసినప్పటికీ సమస్యకు ప్రధాన కారణాలు మాత్రం బయటపడలేదు. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి....
కిడ్నీ వ్యాధి మూలాలు గుర్తించే పరిశోధనకు ఆమోదం
ఆంధ్రా మెడికల్ కాలేజీలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు
రూ.6.2 కోట్ల నిధులు కేటాయించనున్న కేంద్రం
మూడు విడతల్లో.. మూడేళ్ల పాటు పరిశోధనలు
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలడానికి కారణాలేమిటో అంతుచిక్కడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి పరిశోధనలు చేసినప్పటికీ సమస్యకు ప్రధాన కారణాలు మాత్రం బయటపడలేదు. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ‘శ్రీకాకుళం కిడ్నీ రిసెర్చ్ ప్రాజెక్ట్’ పేరిట ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధనలు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఐసీఎంఆర్ బృందం మూడేళ్ల పాటు ఇక్కడే ఉండి కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేయనుంది. ఇందుకోసం ఆంధ్రా మెడికల్ కాలేజీలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. మూడేళ్లలో పరిశోధనలు పూర్తిచేసేందుకు ఐసీఎంఆర్‌కు మూడు దశల్లో రూ.6.2 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ఈ ప్రాజెక్టు కింద నిర్వహించే పరీక్షల ద్వారా ఆరోగ్యశాఖ.. ఒకటి లేదా రెండేళ్లలో కిడ్నీ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న వారిని గుర్తించి వారికి ముందస్తు చికిత్స అందిస్తుంది. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. వాస్తవానికి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఉద్దానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ వ్యాధి మూలాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉద్దానంలో పరిశోధనలు జరపాలని ఈ ఏడాది మార్చి నుంచి ఐసీఎంఆర్‌ను కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఐసీఎంఆర్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనుంది.
5,500 మంది నుంచి శాంపిల్స్ సేకరణ..
ఉద్దానంలో ఇప్పటివరకూ జరిపిన పరిశోధనలను కూడా ఐసీఎంఆర్ పరిగణనలోకి తీసుకోనుంది. 18 ఏళ్లకు పైబడిన వారిలో 5,500 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షిస్తారు. దీనికి హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ రవిరాజు నేతృత్వం వహించనున్నారు. ఈ పరిశోధనల వల్ల ఒకటి, రెండేళ్లలో కిడ్నీల వ్యాధి బారిన పడే వారిని ముందే గుర్తించవచ్చు. ముందుగానే మేల్కొని చికిత్స అందించవచ్చు. అలాగే ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సీంగ్ విధానంలో జన్యు పరీక్షలు కూడా చేస్తారు.
మట్టి, నీరు, గాలి, పంటల నమూనాలు పరీక్ష
రక్త, మూత్ర నమూనాలను పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆంధ్రా మెడికల్ కాలేజీలో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. కొత్తగా సాంకేతిక, పరిశోధన నిపుణులను నియమిస్తారు. తొలి ఏడాది రూ.3.04 కోట్లు, రెండో ఏడాది రూ.1.75 కోట్లు, మూడో ఏడాది రూ.1.21 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తారు. పరిశోధనల్లో భాగంగా ఉద్దానంలోని వేర్వేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయల నమూనాల సేకరించి కూడా పరీక్షిస్తారు. వీటి ఫలితాలనుబట్టి తదుపరి చర్యలు ఉంటాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆస్ట్రేలియాకు చెందిన భారత్‌లోని జార్జ్ ఇనిస్టిట్యూట్‌కు పరిశోధన బాధ్యతలు అప్పగించారు. కానీ.. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల పరిశోధన పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై తిరిగి శ్రద్ధ పెట్టడంతో ఉద్దానంపై మళ్లీ కదలిక వచ్చింది. ఉద్దానం ప్రాంతంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, ఇతర మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో విడతల వారీగా పరిశోధనలు చేయనున్నారు.
మూలాలపై పరిశోధనలు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ కింద ఐసీఎంఆర్ ఈ పరిశోధనలకు ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఐసీఎంఆర్ పరిశోధనల వల్ల కిడ్నీ సమస్యలకు మూలాలు బయటకు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా నిధులు కూడా ఐసీఎంఆర్ భరిస్తుందని చెప్పారు. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
- మంత్రి సత్యకుమార్