International Business Machines: హలో ఏపీ.. మేమొస్తున్నాం
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:58 AM
అమరావతిలో అడుగు పెడుతున్నాం’ అని గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం ధ్రువీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటుకానున్న క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో వచ్చే ఏడాది...
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాం
మార్చికల్లా ప్రారంభించే యత్నాలు
‘ఐబీఎం క్వాంటమ్’ ప్రతినిధి క్రౌడర్ ప్రకటన
న్యూయార్క్, ఆగస్టు 29: ‘అమరావతిలో అడుగు పెడుతున్నాం’ అని గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం ధ్రువీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటుకానున్న క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబీఎం తన క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో భారత్ బలమైన శక్తిగా ఎదగనుందని, భవిష్యత్తులో ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నందున ఈ పరిశోధనలవైపు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2’ను ఇన్‌స్టాల్ చేయడానికి భారత్‌కు చెందిన అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు టీసీఎ్‌సతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని... 2026 మార్చి ఆఖరుకు నాటికి దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఐబీఎంలో క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ తెలిపారు. అమెరికాలోని ఐబీఎం రిసెర్చ్ ప్రధాన కార్యాలయమైన థామస్ జే వాట్సన్ సెంటర్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో క్రౌడర్ మాట్లాడుతూ... ఐబీఎం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లను ప్రకటించిందని.. వాటిలో ప్రస్తుతం అమెరికాలో ఒకటి, జపాన్‌లో రెండు, కెనడా, దక్షిణ కొరియాల్లో ఒక్కొక్కటి చొప్పున పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో ఏర్పాటయ్యే సెంటర్‌తోపాటు.. స్పెయిన్, అమెరికాలోని షికాగోలో కూడా త్వరలోనే తాము ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని క్రౌడర్ వెల్లడించారు. భారత్‌లో క్వాంటమ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తమ సంస్థ ఆసక్తిగా ఉందని, ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ప్రభుత్వ నేషనల్ క్వాంటమ్ మిషన్, ఐఐటీ వంటి విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఆ దిశగా పనిచేస్తామని ఆయన తెలిపారు.