Visakhapatnam: ఐఏఎస్ అధికారుల ఆదర్శ వివాహం
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:46 AM
దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా అట్టహాసంగా వివాహం చేసుకుంటున్న ఈ కాలంలో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు నిరాడంబరంగా గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు.
గుడిలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో చట్టబద్ధంగా రిజిస్ర్టేషన్
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా అట్టహాసంగా వివాహం చేసుకుంటున్న ఈ కాలంలో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు నిరాడంబరంగా గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలు చేసి చట్టబద్ధంగా దంపతులయ్యారు. ఈ వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు హాజరై ఆశీర్వదించారు. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారులు ఎవరంటే....అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ టి.శ్రీ పూజ వధువు. వరుడు మేఘాలయలోని దాదెంగ్రి జాయింట్ కలెక్టర్ ఆదిత్యవర్మ. వేర్వేరు రాష్ట్రాలకు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమేనని శ్రీ పూజ తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి వద్దనున్న శివాలయంలో శుక్రవారం ఉదయం దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీ పూజ, ఆదిత్యవర్మ.. వన్‌టౌన్‌లోని సూపర్ బజారు కార్యాలయం ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి వీరి వివాహాన్ని నమోదు చేయించారు.