CS K. Vijayanand: తిరుపతి ఓట్ల వ్యవహారంలో ఐఏఎస్ గిరిశాకు ఉపశమనం
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:37 AM
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీఎస్ గిరిశాకు ఉపశమనం లభించింది.
తదుపరి చర్యలు నిలిపివేత.. ఆయన పాత్ర లేదని క్లీన్ చిట్
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటరు కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో సస్పెండైన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీఎస్ గిరిశాకు ఉపశమనం లభించింది. ఈ వ్యవహారంలో గిరిశాకు ఎలాంటి పాత్ర లేదని ప్రభుత్వానికి విచారణాధికారి నివేదిక అందించారు. దీంతో ప్రభుత్వం ఆయనపై తదుపరి చర్యలను నిలిపివేసింది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు. దొంగ ఓటరు కార్డుల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. సాధారణ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్తూరు కలెక్టర్‌గా ఉన్న గిరిశాను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆయన తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఈ వ్యవహరం జరిగిందని ఈసీ పేర్కొంది. ప్రభుత్వం ఎస్.సురేశ్ కుమార్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. దొంగ ఓటరు కార్డుల వ్యవహారంలో గిరిశా పాత్ర లేదని తేలడంతో ప్రభుత్వం తదుపరి చర్యలను నిలిపివేసింది.