Tenali: ఆర్థిక నిపుణుడు నాగరాజుకు నాయుడమ్మ పురస్కారం
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:05 AM
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారానికి ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాల ఎంపికయ్యారు.
ఈ ఏడాది అవార్డుకు ఎంపికైన ఐఏఎస్ అధికారి
ఈనెల 10న తెనాలిలో పురస్కారం ప్రదానం
అవార్డు అందజేయనున్న తెలంగాణ గవర్నర్
తెనాలి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారానికి ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాల ఎంపికయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖలో ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగా ఉన్న ఆయనకు 2025 సంవత్సరం పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. ప్రఖ్యాత చర్మశాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన డాక్టర్ నాయుడమ్మ బాపట్ల జిల్లా అమృతలూరు మండలం యలవర్రు గ్రామంలో జన్మించారు. నాయుడమ్మ పేరుపై ఏటా శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో నిపుణులకు అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది పురస్కారాన్ని నాగరాజు మద్దిరాలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈనెల 10న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అందించనున్నారు. సీఎస్ఐఆర్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి. కాంత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, మద్దిరాల నాగరాజు 1993వ బ్యాచ్‌కు చెందిన త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన కృష్ణా జిల్లాలో 1966లో జన్మించారు. ప్రస్తుతం 2025 కేంద్ర బడ్జెట్ రూపకల్పన భాగస్వామిగా ఉన్నారు.