Share News

Nidigunta Aruna: హోం మంత్రినవుతా

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:21 AM

ఆమె మాటలతోనే మాయ చేస్తుంది. నెట్‌వర్క్‌ పెంచుకునేందుకు ఎన్ని దారుల్లో అయినా వెళ్తుంది. తెల్లరేషన్‌ కార్డుదారు అయి ఉండీ ముప్పై లక్షల ఖరీదు చేసే కారులో తిరుగుతుంది.

Nidigunta Aruna: హోం మంత్రినవుతా

  • పోలీసు విచారణలో కి‘లేడీ’ షాక్‌

  • వైసీపీ ప్రభుత్వంలో అరుణకు తెల్లరేషన్‌ కార్డు

  • మళ్లీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించే అవకాశం

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ‘ఆమె మాటలతోనే మాయ చేస్తుంది. నెట్‌వర్క్‌ పెంచుకునేందుకు ఎన్ని దారుల్లో అయినా వెళ్తుంది. తెల్లరేషన్‌ కార్డుదారు అయి ఉండీ ముప్పై లక్షల ఖరీదు చేసే కారులో తిరుగుతుంది. ఎలాంటి ఆదాయం లేకున్నా అత్యంత సంపన్న వర్గాల వారిలా జీవిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతా.. రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని అవుతా.. మీకు పోస్టింగ్‌లలో సాయం చేస్తా అంటోంది. ఆమెకు మతి భ్రమించిందా.. ఏంటాని నవ్వుకున్నాం’ అని లేడీ డాన్‌ నిడిగుంట అరుణను విచారించిన ఓ పోలీసు అధికారి తన సహచరులతో ఈ వివరాలు పంచుకున్నారు. అరుణకు ఆదాయ మార్గాలేంటని నెల్లూరు జిల్లా పోలీసులు మూడు రోజుల కస్టడీలో ప్రశ్నించారు. మొదటి రెండు రోజుల పాటు పొంతనలేని సమాధానాలు చెప్పిన ఆమె మూడో రోజు కాస్త నోరు విప్పింది. అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమెకు ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల వద్ద పైరవీలు చేసే స్థాయి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించారు. తాను సామాన్యురాలినని, తనకున్న తెల్లరేషన్‌ కార్డు ఇందుకు నిదర్శనమని, ఒక పేపర్‌ వాళ్లు తనపై వార్తలు రాసి లేడీ డాన్‌ను చేశారని చెప్పింది. వీఆర్‌వోను పోలీసులు సంప్రదించగా.. ఆమెకు 2024వరకూ గత ప్రభుత్వంలో తెల్లరేషన్‌కార్డు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత కార్డు రద్దయిందని చెప్పారు. నాలుగు కార్లు ఎలా వచ్చాయని అరుణను పోలీసు అధికారులు ప్రశ్నించగా.. తన పేరుతో ఏవీ లేవని, మరొకరి పేరుతో ఉన్నాయని చెప్పింది. ‘పేరు ఎవరిదైనా వాడుతున్నది నువ్వేగా’.. అని పోలీసులు ప్రశ్నించారు. తనకు ఎలాంటి ఆదాయం లేదని, చెల్లెలు ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏవోగా పనిచేస్తూ నెలకు లక్షన్నర జీతం తీసుకుంటుందని, కొంత తనకు ఇస్తుందని ఆమె చెప్పింది.


అయితే ఇవన్నీ పోలీసు విచారణలో అబద్ధాలుగా తేలాయి. కారు ఈఎంఐలతో పాటు తిరగడానికి డీజిల్‌, డ్రైవరు జీతం ఇతరత్రా ఖర్చులు ఎలా భరిస్తున్నావని ప్రశ్నించారు. పెద్దవాళ్లు తనకు సాయం చేసేవారని చెప్పిన అరుణ.. ఆ పెద్దలు ఎవరో వెల్లడించలేదు. అబలలకు అండగా నిలిచేందుకు తానే దిశ ఫౌండేషన్‌ స్థాపించానని, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే క్రమంలో పలువురు పరిచయమయ్యారని చెప్పింది. ప్రజలకు సేవ చేసి గూడూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రానికి హోం మంత్రిని అవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, పేపర్‌ వాళ్లు తన జీవితాన్ని రోడ్డుకు లాగారని వెల్లడించింది. ‘ఏపీలో టీడీపీ లేదా వైసీపీ అధికారంలోకి వస్తాయి. ఆ రెండు పార్టీలు ఎస్సీ మహిళకే హోంశాఖ మంత్రి పదవి ఇస్తాయి. నా కన్నా బాగా మాట్లాడేవారు ప్రస్తుతం ఆ రెండు పార్టీల్లో లేరు. శ్రీకాంత్‌కు రెమిషన్‌(అక్టోబరు 2న) తెచ్చుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నా. అతను బయటికి వచ్చుంటే పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్లి బతకాలనే ఆలోచన ఉండేది’ అని అరుణ చెప్పింది. కొన్నాళ్ల పాటు ఎటైనా వెళ్లిపోయి ఎన్నికలకు ముందు గూడూరులో మకాం వేయాలని అనుకున్నట్లు వివరించింది.


సోషల్‌ మీడియా ద్వారానే..

తనకు సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువ మంది పరిచయమయ్యారని, తాను అందంగా ఉన్నందున రీల్స్‌ చేసి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో పోస్టు చేసేదాన్నని అరుణ చెప్పింది. పలువురు లైక్‌లు కొట్టి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టేవారని, ప్రముఖుల్ని కలిసిన ఫొటోలు పోస్టు చేయడంతో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్‌ అయ్యారని వెల్లడించింది. నెల్లూరులో గత కొంతకాలంగా జరిగిన వరుస హత్యల గురించి ప్రస్తావించగా.. తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఆమె ఫోన్లో ట్రాన్స్‌జెండర్‌ హత్యకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో సమాచారం విశ్లేషించిన తర్వాతమరోమారు లేడీ డాన్‌ను కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. మూడు రోజుల కస్టడీలో అనుకున్నంత సమాచారం రాలేదని తెలుస్తోంది. ఆమెతో ఫొటోలు దిగిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలు జరిపినవారు, తరచూ ఫోన్లలో మాట్లాడినవారి వివరాలను.. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తిరుపతి వెళ్తూ నెల్లూరు పోలీసులను ఆరా తీశారు.

Updated Date - Sep 01 , 2025 | 05:22 AM