Share News

Palnadu District: భార్యను చంపి..శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి..

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:28 AM

విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటున్న భార్యను.. మాట్లాడాలని చెప్పి బయటకు తీసుకెళ్లిన భర్త..

Palnadu District: భార్యను చంపి..శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి..

  • పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

రొంపిచర్ల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటున్న భార్యను.. మాట్లాడాలని చెప్పి బయటకు తీసుకెళ్లిన భర్త.. ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత బైక్‌పై ఆమె శవాన్ని తీసుకుని వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామానికి చెదిన అల్లరి వెంకటేశ్‌తో రొంపిచర్ల మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (26)కి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా మహాలక్ష్మి కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో.. ఆదివారం మాచవరం వచ్చిన వెంకటేశ్‌.. మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పి ఆమెను ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు. మాచవరం, బెహరావారిపాలెం మధ్యలో మహాలక్ష్మి చున్నీతోనే ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. సంతమాగులూరు పోలీసులు, నరసరావుపేట రూరల్‌ సీఐ సుబ్బారావు మాచవరం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. వివాహమైనప్పటి నుంచి తన కుమార్తెను.. ఆమె భర్త వెంకటేశ్‌, అతని సోదరుడు శ్రీను, అక్కలు రమణ, శబరి వేధించేవారని మృతురాలి తల్లి మరియమ్మ ఆరోపించారు. అనుమానంతోనే మహాలక్ష్మిని వెంకటేశ్‌ హత్య చేశాడని ఆమె రొంపిచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రొంపిచర్ల ఇన్‌చార్జి ఎస్‌ఐ ఫాతిమా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 15 , 2025 | 04:29 AM