Gannavaram: బాణసంచా వివాదంలో.. భార్యను పొడిచేశాడు
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:16 AM
భార్యభర్తల మధ్య స్వల్ప వివాదం చినికి చినికి.. గాలివానగా మారింది. మద్యం మత్తులో భర్త.. చాకుతో భార్య ఎడమవైపు నుదిటి మీద బలంగా పొడవగా అది నోట్లోకి వచ్చింది.
శస్త్ర చికిత్స చేసి చాకు తొలగించిన వైద్యులు
పి.గన్నవరం/కాకినాడ(జీజీహెచ్) అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): భార్యభర్తల మధ్య స్వల్ప వివాదం చినికి చినికి.. గాలివానగా మారింది. మద్యం మత్తులో భర్త.. చాకుతో భార్య ఎడమవైపు నుదిటి మీద బలంగా పొడవగా అది నోట్లోకి వచ్చింది. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి గ్రామంలో సోమవారం రాత్రి జరగ్గా బాధితురాలికి కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు మంగళవారం శస్త్రచికిత్స నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి గ్రామానికి చెందిన నేలపూడి గంగరాజు అదే గ్రామానికి చెందిన పల్లాలమ్మ(పల్లవి)(36)ని 20ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గంగరాజు మద్యానికి బానిసై తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండడంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈక్రమంలో సోమవారం దీపావళి సందర్భంగా బాణసంచా కోసం కొంత నగదు గంగరాజు భార్యకు ఇచ్చాడు. ఈ విషయమై సాయంత్రం వారిద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో గంగరాజు మద్యం తాగి వచ్చి భార్యపై గొడవకు దిగాడు. ఈక్రమంలో తన దగ్గర ఉన్న చాకుతో గంగరాజు ఆమెను గొంతులో పొడిచేందుకు ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో పల్లవి తల కిందికి పెట్టడంతో చాకు ఎడమ కన్ను పైభాగం నుంచి నోట్లోకి దిగబడింది. దీంతో కుటుంబీకులు, బంధువులు వెంటనే ఆమెను అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం దీపావళి సెలవు కావడంతో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పి.గన్నవరం ఎస్‌ఐ బి.శివకృష్ణ తెలిపారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం.