Illicit Relationship: అల్లుడి కోసం.. భర్తనే చంపేసింది
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:00 AM
నంద్యాల జిల్లా కేంద్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అత్త.. తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆపై భర్తనే కడతేర్చింది.
వివాహేతర సంబంధమే కారణం
నంద్యాల జిల్లాలో దారుణం
నంద్యాల టౌన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కేంద్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అత్త.. తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆపై భర్తనే కడతేర్చింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. నంద్యాల నందమూరి నగర్‌లో ఉంటున్న గుర్రప్ప(40) సుభద్ర (30)కు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తెకు ఆరు నెలల కిందట రుద్రవరం మండలం తువ్వపల్లెకు చెందిన లింగమయ్య (31)తో వివాహం చేశారు. వారికి ఇంకా 8వ తరగతి, ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి అత్త సుభద్రతో లింగమయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి భర్త గుర్రప్ప పెద్దమనుషుల వద్ద కొన్ని నెలల క్రితం పంచాయితీ చేసి సర్ది చెప్పారు. అప్పటి నుంచీ అల్లుడితో మాట్లాడడానికి, ఏకాంతంగా కలవడానికి కుదరడంలేదని, భర్త అడ్డు తొలగించుకోవాలని సుభద్ర భావించింది. బుధవారం రాత్రి అల్లుడిని ఇంటికి పిలిచింది. అప్పటికే భర్తకు పూటుగా మద్యం తాగించింది. పిల్లలను వేరేగదిలో పడుకోబెట్టి అల్లుడితో కలిసి భర్త గొంతుకు వైరు బిగించి హత్య చేసింది. తర్వాత ఇద్దరూ పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.