Domestic Violence: ఫోన్ మాట్లాడొద్దన్నాడని చంపేసింది!
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:44 AM
సెల్‌ఫోన్ అతిగా మాట్లాడొద్దని మందలించిన భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్త కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు..
భర్తను గొడ్డలితో కొట్టిన భార్య
చింతపల్లి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్ అతిగా మాట్లాడొద్దని మందలించిన భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్త కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో కిల్లో రాజారావు (46), దేవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. దేవి రెండేళ్లుగా ఫోన్‌లో ఓ వ్యక్తితో మాట్లాడుతోంది. దీనిపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం దేవి ఫోన్‌లో మాట్లాడుతుండడంతో రాజారావు ఆగ్రహానికి గురయ్యాడు. అదేపనిగా ఎందుకు మాట్లాడుతున్నావు?, ఆపేయమంటూ గద్దించాడు. ఆగ్రహానికి గురైన దేవి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త తలపై గొడ్డలి వెనుక భాగంతో గట్టిగా కొట్టింది. దీంతో రాజారావు స్పృహ కోల్పోయాడు. పక్కన నిద్రిస్తున్న కుమారుడు లేచి చూసి చుట్టుపక్కల వారి సాయంతో 108 వాహనంలో రాజారావును చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మంగళవారం ఉదయం కేజీహెచ్‌కు తరలించగా.. రాజారావు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.