Husband Attacks Wife: కట్టుకున్నవాడే కడతేర్చాడు
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:10 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూడేళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు ప్రారంభం కావడంతో విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో...
పట్టపగలు నడిరోడ్డుపైనే భార్యను కత్తితో పొడిచి హత్య
చనిపోయిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫోన్
విజయవాడలో దారుణం, కేసు నమోదు
విజయవాడ (వన్‌టౌన్), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మూడేళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు ప్రారంభం కావడంతో విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమె పనిచేసే హాస్పిటల్ వద్దే భార్యను కత్తితో కిరాతకంగా హత్యచేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే అక్కడకి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన విజయపాల విజయ్ కూడా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి సుమారు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో విజయ్ భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక సరస్వతి కుమారుడిని తీసుకుని నూజివీడులో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ప్రతిరోజూ అక్కడ నుంచే విజయవాడ సూర్యారావుపేటలోని విన్స్ హాస్పిటల్‌కు డ్యూటీకి వస్తోంది. ప్రస్తుతం ఈ దంపతుల విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. గురువారం ఉదయం సరస్వతి హాస్పిటల్‌కు డ్యూటీకి వచ్చింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లటానికి బయటకు వచ్చింది. అదే సమయంలో విజయ్ ఆమెను అడ్డుకుని వెంటతెచ్చుకున్న కత్తితో సరస్వతిని పొడిచి పీక కోయడంతో అక్కడికక్కడే పడిపోయింది. స్థానికులు విజయ్‌ను అడ్డుకోవటానికి ప్రయత్నించగా దగ్గరకు రావద్దని కత్తితో బెదిరించాడు. సరస్వతి చనిపోయిందని నిర్ధారించుకున్నాక తాపీగా అక్కడ నుంచే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి భార్యను హత్య చేశానని చెప్పాడు. సౌత్ ఏసీపీ పవన్ కుమార్, సీఐ ఆలీ ఘటనా ప్రాంతానికి చేరుకుని విజయ్‌ను స్టేషన్‌కు తరలించారు. అనంతరం సమాచారాన్ని నూజివీడులో ఉన్న సరస్వతి తల్లిదండ్రులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో వేట కొడవలితో నరికేశాడు
బెళుగుప్ప, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా బెళుగుప్పకు చెందిన శాంతికి గుంతకల్లుకు చెందిన ఆంజనేయులుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు బెళుగుప్పలోనే కాపురం ఉంటున్నారు. ఆంజనేయులు లారీ డ్రైవర్ కాగా, శాంతి కూలి పనులకు వెళ్లేది. వీరి కుమారుడు మహేంద్ర పదో తరగతి చదువుతున్నాడు. కూతురు లహరికి ఇటీవల వివాహం చేశారు. కొన్ని నెలలుగా భార్యపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు.. ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో తలుపులు వేసుకుని తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన ఆంజనేయులు ఇంట్లో ఉన్న వేటకొడవలితో శాంతి(35) తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత చేతిలో వేటకొడవలిని పట్టుకుని బయటకు వచ్చిన ఆంజనేయులు.. తన భార్యను చంపేశానని కేకలు వేసుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని ట్రైనీ ఎస్‌ఐ మహేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
