Humanist: మానవతావాది మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:14 AM
జమియత్ ఉలేమా ఏ హింద్ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడు మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
సంతాప సందేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి
ఆయన మరణం తీరనిలోటు: వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జమియత్ ఉలేమా ఏ హింద్ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడు మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారని, మానవతావాదిగా ఆయన చేసిన సేవలు నిరుపమానం అని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. కాగా, మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మరణం మతపరమైన, సామాజిక, విద్యా రంగాలకు తీరనిలోటని సంతాప సందేశంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మరణించినట్టు తెలిపారు. జీవితాంతం మతసేవ, విద్యా ప్రాచుర్యం, మానవతా విలువల ప్రోత్సాహానికి ఆయన అంకితమయ్యారని, సమాజంలో శాంతి, సహనం, ఐక్యత వంటి విలువలను వ్యాప్తి చేశారని కొనియాడారు.