AP High Court: పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వలంటీర్లు ఎలా వస్తారు
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:58 AM
పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వలంటీర్లు ఎలా వస్తారని పిటిషనర్‌ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
గౌరవ వేతనం మాత్రమే చెల్లించారు
పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
పవన్ కల్యాణ్‌పె కేసు ఉపసంహరణ పిటిషన్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశం
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వలంటీర్లు ఎలా వస్తారని పిటిషనర్‌ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సేవలు అందించినందుకుగాను ప్రభుత్వం వారికి గౌరవ వేతనం మాత్రమే చెల్లించిందని గుర్తుచేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుంటూరు కోర్టు పీపీ దాఖలు చేసిన క్రిమినల్ కేసు విచారణార్హతపై సందేహం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కోసం వేసిన పిటిషన్‌ను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ముందు వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని, మహిళలు అపహరణకు గురౌతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా పవన్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. అప్పట్లో కేసు వేసేందుకు అఫిడవిట్లు ఇచ్చిన ఐదుగురు వలంటీర్లు.. ఆ తర్వాత పవన్ వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలగలేదని, వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకొని పిటిషన్లు వేశారని అఫిడవిట్లు వేశారు. న్యాయాధికారి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంతో పవన్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో గుంటూరు నాలుగో అదనపు జిల్లా జడ్జి పవన్ కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ గతేడాది నవంబరులో ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సరళ, మరో ముగ్గురు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. కేసు ఉపసంహరణకు అనుమతించే అధికార పరిధి గుంటూరు కోర్టుకు లేదన్నారు. విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు పరిధిలోకి ఈ వ్యవహారం వస్తుందన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఘటన జరిగే నాటికి పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధి కాదు కదా? అని ప్రశ్నించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్లకు లేదని, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.