ఆ తల్లికి ఎంత శోకమో..!
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:36 AM
ఆ తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. ఇప్పటికే భర్త కోల్పోయి కడు దుఃఖంలో ఉండగా.. చేతికొచ్చిన కొడుకు సైతం అనంత లోకాలకు చేరాడు..
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఆ తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. ఇప్పటికే భర్త కోల్పోయి కడు దుఃఖంలో ఉండగా.. చేతికొచ్చిన కొడుకు సైతం అనంత లోకాలకు చేరాడు.. ఆమెకు పుత్రశోకాన్ని తెచ్చి పెట్టాడు. భర్త లేడన్న బాధను దిగమింగుకొని కొడుకులను చూసుకుంటూ జీవన పోరాటం సాగిస్తుండేది. పెద్ద కొడుకుకు పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేసింది. ఇక చిన్న కుమారుడు సైతం కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగించేవాడు. వీరి కుటుంబం అంతా కూలీనాలి చేసుకుంటూ వచ్చిన దాంట్లో సంతోషంగా గడిపేవారు. ఒక్కసారిగా విధి వక్రీకరించింది. చేతికొచ్చి చేదోడువాదోడుగా ఉంటాడు అనుకున్న కొడుకు జీవచ్ఛవంలా ఉండటం ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. దేవుడా.. నాకేంటి ఈ ఖర్మ అంటూ గుండె బాదుకుంటూ రోదిస్తున్న తీరును చూస్తే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రావాల్సిందే.
కూలి పనులకు వెళ్తూ..
కూలీ పనులకు వెళ్తూ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో కర్నూలు నగర శివారు టీవీ 9 కాలనీకి చెందిన శివశంకర్(24) దుర్మరణం చెందాడు. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ జిల్లా అలంపూరం మండలంలో కసాపురానికి చెందిన నాగన్న, యశోద దంపతులు. వీరి కుమారులు శ్రీహరి, శివశంకర్. 2015లో నాగన్న మృతి చెందారు. నగరు శివారులోని టీవీ9 కాలనీకి యశోద తన పిల్లలను తీసుకువచ్చి అక్కడే ఉండి జీవనం కొనసాగిస్తుంది. శివశంకర్ గ్రానైట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీహరికి వివాహం కాగా మృతుడి శివశంకర్‌కు ఇంకా పెళ్లి కాలేదు. అన్న, తల్లి గౌండ పనులు చేస్తున్నారు. ఇంతకుముందే భర్తని కోల్పోయిన తల్లికి పుత్రశోకం వచ్చింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ఆ తల్లి ఆర్తనాదాలు పలువురికి కన్నీళ్లు తెప్పించాయి. మార్చురీకి వచ్చిన శివశంకర్ బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పెళ్లికాకుండానే అనంత లోకాలకు వెళ్లావా నాయనా అంటూ పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు.