ఇంకెన్నాళ్లీ కష్టాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:10 PM
విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది.
కొన్నేళ్లుగా వేర్వేరు ప్రాంతాల్లో బడి నిర్వహణ
ప్రస్తుతం రేకులషెడ్‌లో సాగుతున్న పాఠశాల
భయాందోళనలో విద్యార్థులు
విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అయినా పలుచోట్ల సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అలాంటిదే కోడుమూరు మండలంలోని రామాపురం గ్రామ పాఠశాల పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా సొంత భవనం లేక వేర్వేరు ప్రాంతాల్లో పాఠశాలను నిర్వహించారు. చివరకు రేకుల షెడ్డుకు మార్చారు. అక్కడి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తోందని, ఏ పురుగో.. పుట్రో వస్తాయోననే భయంతో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖాధికారులు స్పందించి నూతన పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కోడుమూరు రూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని లద్దగిరి మజారా రామాపురం గ్రామంలో సుమారు 500 జనాభా ఉంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. నిధులు మంజూరు కావడంతో 2019కు ముందు శిథిలమైన పాఠశాల గదులను కూలగొట్టారు. కొత్తగా గదుల నిర్మాణానికి పూనుకున్న కాంట్రాక్టర్ పునాదులు తవ్వారు. పనులు ప్రారంభించలేదు. ఉన్న గదులు తొలగించడం, కొత్త పనులు ఆగిపోవ డంతో పాఠశాల గ్రామంలోని రామాలయంకు చేరింది. 2019, 2020, 2021 విద్యా సంవత్సరాలు ఆలయంలో ముగిశాయి. అనంతరం మరో ప్రాంతంలో ఉన్న గ్రామానికి చెం దిన ఓవ్యక్తి తన ఇల్లు ఇవ్వడంతో 2022-23 విద్యాసంవత్సరం గడిచింది. ఎండాకాలం సెలవుల్లో ఆవ్యక్తి కుటుంబంతో గ్రామానికి చేరాడు. 2023-24 కొత్తకాలనీ దగ్గర సుం కులమ్మ గుడి ఆవరణకు పాఠశాల చేరింది. మరోవైపు ఉపాధ్యాయులు, విద్యార్థుల ఇబ్బం దులపై వరుస పత్రికా కథనాలతో నాడు నేడు ఫేజ్-2 కింద నిధులు మంజూరయ్యాయి. రూ.40లక్షలతో రెండు గదులు, ప్రహరీ, కిచెన షెడ్, టాయ్‌లెట్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
10 సెంట్ల స్థలంలో..
కొత్తకాలనీలో పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన 10 సెంట్ల స్థలంలో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ సమయంలో సుంకులమ్మ గుడి ఆవరణలో ఉన్న పాఠశాల వర్షం సమయంలో విద్యార్థుల ఇబ్బందులను గమనించి సమీపంలో నివసిస్తున్న వ్యక్తి తన రేకుల షెడ్డులో పాఠశాలకు ఆశ్రయం కల్పించాడు. పాఠశాల గదులు, కిచెన, టాయ్‌లెట్స్ స్లాబ్ పూర్తయ్యాయి. ఆ తర్వాత నిధులు లేక పనులు నిలిచిపోయాయి. ఇంకా ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, కిటికీలు, ఎలక్ర్టిసిటీ, రంగులు వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు ఆగిపోవడంతో పాఠశాల గదుల ముందు పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. పక్కనే ప్రస్తుతం పాఠశాల నిర్వహిస్తున్న రేకుల షెడ్ ఉండడంతో పురుగుపుట్రా భయం ఉంది.
ఒక్కరే ఉపాధ్యాయుడు
రామాపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతి వరకు కలిపి మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నారు. అన్ని తరగతులను ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. ఏవైనా పాఠశాలకు సంబంధించిన పనులు, మీటింగ్ సమయాల్లో మరో పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని పంపుతున్నారు. అష్టకష్టాలు పడుతున్న పాఠశాల పరిస్థితిని చూసిన పలువురు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు చేర్చారు.
సుంకులమ్మది గొప్ప మనసు:
పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే సుంకులమ్మ అనే మహిళది గొప్ప మనసు అనవచ్చు. ప్రస్తుతం దినసరి కూలీ పనులకు వెళితే కనీసం రూ.300 అందుతుంది. ఆమె ఆరేళ్లుగా తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థులకు రోజూ భోజనం వండి అందిస్తోంది.