ఇంత బరి తెగింపా!
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:49 AM
ఇసుక క్వారీలపై గ్రీన్ ట్రిబ్యునల్, కలెక్టర్ ఆదేశాలు ఉన్నా వైసీపీ నేత బరి తెగించారు. రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో ఎక్స్‌కవేటర్లను పెట్టి మరీ ఇసుక, బుసక తవ్వి తరలించేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ నేతకు అంత ధైర్యమెక్కడి నుంచి వచ్చింది? ఆయనకు టీడీపీ నేతలు కొమ్ము కాస్తున్నార అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్ ఎక్స్‌కవేటర్లను క్వారీ నుంచి బయటకు పంపిస్తామని చెప్పిన తర్వాత యథేచ్ఛగా తవ్వకాలు జరపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-ఆ వైసీపీ నేతకు అంత ధైర్యమెక్కడిది?
-టీడీపీ నేతలు కొమ్ము కాస్తున్నారా!
-గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇక్కడ అమలు కావా?
-ఎక్స్‌కవేటర్‌లను బయటకు పంపిస్తామన్న తహసీల్దార్
-కానీ క్వారీలోనే ఉంచి శుక్రవారం రాత్రంతా ఇసుక తవ్వకాలు
ఇసుక క్వారీలపై గ్రీన్ ట్రిబ్యునల్, కలెక్టర్ ఆదేశాలు ఉన్నా వైసీపీ నేత బరి తెగించారు. రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో ఎక్స్‌కవేటర్లను పెట్టి మరీ ఇసుక, బుసక తవ్వి తరలించేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ నేతకు అంత ధైర్యమెక్కడి నుంచి వచ్చింది? ఆయనకు టీడీపీ నేతలు కొమ్ము కాస్తున్నార అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్ ఎక్స్‌కవేటర్లను క్వారీ నుంచి బయటకు పంపిస్తామని చెప్పిన తర్వాత యథేచ్ఛగా తవ్వకాలు జరపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తోట్లవల్లూరు, జూలై 19(ఆంధ్రజ్యోతి):
రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. క్వారీల వద్దకు శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ వెళ్లి తహసీల్దార్ ఎం.కుసుమకుమారిని వివరణ కోరితే, అక్కడ ఉన్న రెండు ఎక్స్‌కవేటర్‌లను బయటకు పంపిస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రెండు ఎక్స్‌కవేటర్‌లను క్వారీల్లోనే ఉంచటంతో శుక్రవారం రాత్రంతా అక్రమ తవ్వకాలు జరిపారు. ఇక్కడ అక్రమ క్వారీలు ఏర్పాటు చేసింది ఓ వైసీపీ నేత. అతనికి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ స్పష్టం చేశారు. అయినా క్వారీలు నడపటం గమనార్హం.
నిషేధం తమకు వర్తించదన్నట్టు..
అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలు నిషేధిస్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కలెక్టర్ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇన్ని ఆదేశాలున్నప్పటికీ ప్రతిపక్షపార్టీకి చెందిన వ్యక్తి రెండు క్వారీలు ఏర్పాటు చేయటం బరితెగింపుగా విమర్శలు వస్తున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల కమిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంది. ఈ కమిటీలో ఎస్సై కూడా ఉంటారు. అధికారులే కాకుండా పోలీసులు కూడా అక్రమ ఇసుక తవ్వకాలపై నిఘా పెట్టాల్సి ఉంది. మండలంలో ఇటు రెవెన్యూ అధికారులు, అటు పోలీసులు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆవగింజంత కూడా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రొయ్యూరు ఎస్సీ సొసైటీలో నడుస్తున్న రెండు క్వారీలే అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో అర్ధరాత్రి తవ్వకాలు శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ వార్త వచ్చాక కూడా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకుండా ఉందంటే ఇసుక, బుసక మాఫియా ఎంత బలంగా ఉందో అర్థం అవుతోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో క్వారీల వద్దకు ‘ఆంధ్రజ్యోతి’ వెళ్లగా ఒక ఎక్స్‌కవేటర్ క్వారీలో ఇసుక ఎంత లోతున ఉందో తవ్వుతోంది. ఫొటో తీయటంతో ఎక్స్‌కవేటర్ ఆపరేటర్ దిగి వెళ్లిపోయాడు. మరో ఎక్స్‌కవేటర్ పొదల మాటునే ఉంది. క్వారీల్లో పరిశీలిస్తే శుక్రవారం రాత్రి భారీగా ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి.
తెర వెనుక టీడీపీ నేతలు!
తోట్లవల్లూరు చెందిన వైసీపీ నేతకు టీడీపీ నేతలు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్వారీ బాట నిర్మించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అతనికి అండగా నిలవటం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. అంతేకాక ఓ ఐఎఎస్ అధికారి ఇతని క్వారీలకు అండగా నిలిచారనే ప్రచారం జరుగుతోంది.
బలయ్యేది అధికారులే!
అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోకుంటే బలయ్యేది అధికారులేనని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారికంగా ఆ వైసీపీ నేత పేరుతో క్వారీ మంజూరు కాలేదు. కేవలం అధికారులు, అధికార పార్టీ నేతల అండతోనే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి అనధికార క్వారీలను ఏర్పాటు చేయటం జరిగిందంటున్నారు. ఉన్నతాధికారులు సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే స్థానిక అధికారులకే ఇబ్బంది ఎదురవుతుంది.
వీఆర్వో, ఇద్దరు పోలీసులను పెట్టాం : తహసీల్దార్
రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో ఇసుక తవ్వకాలు ఆగని విషయమై శనివారం తహసీల్దార్ ఎం.కుసుమకుమారిని వివరణ కోరగా, శుక్రవారం రాత్రి వీఆర్వో, ఇద్దరు పోలీసులను కాపలా పెట్టామని చెప్పారు. మిషన్‌లను సీజ్ చేయకుండా వీఆర్వోని, పోలీసులను కాపలా పెట్టామని చెప్పటం హాస్యస్పదంగా మారింది.