Somireddy Chandramohan Reddy: హౌసింగ్‌లో ప్రక్షాళన జరగాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:27 AM
వైసీపీ హయాంలో పేదల ఇళ్ల మాటున భారీ అవినీతి జరిగింది. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రూ.వందల కోట్లు పక్కదారి పట్టించారు. విజిలెన్స్ నివేదికిచ్చినా వారిపై చర్యలు లేవు.
గత ప్రభుత్వంలో ఐదు వేల కోట్ల అవినీతి
చర్యలు లేకపోగా... అవినీతిపరులకే పట్టం కట్టారు
సీఎంకు వివరంగా లేఖ రాశా: సోమిరెడ్డి
నెల్లూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో పేదల ఇళ్ల మాటున భారీ అవినీతి జరిగింది. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రూ.వందల కోట్లు పక్కదారి పట్టించారు. విజిలెన్స్ నివేదికిచ్చినా వారిపై చర్యలు లేవు. ఇప్పటికీ వాళ్లదే రాజ్యం’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం టీడీపీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘హౌసింగ్ అక్రమాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి విజిలెన్స్ విచారణ వేయించా. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఇళ్లు కట్టకుండా కట్టినట్లు చూపించి రూ.110 కోట్లు ప్రజా సొమ్ము పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ నిగ్గు తేల్చింది. ఇక క్వాలిటీ చెక్ చేస్తే మరో రూ.100 కోట్ల వరకూ అవినీతి తేలుతుంది. ఇలా రాష్ట్రం మొత్తం చూసుకుంటే రూ.5 వేల కోట్లకు పైగానే కుంభకోణం జరిగింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చినా బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్టర్లు, అధికారులను ఇప్పుడు కూడా అందలం ఎక్కిస్తున్నారు. వివరాలన్నింటితో సీఎంకు లేఖ రాశా’ అని తెలిపారు.