Share News

Hot Tea Accident: పసివాడిని బలిగొన్న వేడి తేనీరు

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:52 AM

ప్లాస్క్‌లో పోసి పెట్టిన వేడి టీ తాగి.. నాలుగేళ్ల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. రెండేళ్ల అతడి చెల్లెలు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైంది.

Hot Tea Accident: పసివాడిని బలిగొన్న వేడి తేనీరు

  • తెలియక తాగేయడంతో గొంతు కాలి ఆగిన ఊపిరి

  • ఆస్పత్రి పాలైన మరో చిన్నారి

  • అనంతలో విషాదం

యాడికి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ప్లాస్క్‌లో పోసి పెట్టిన వేడి టీ తాగి.. నాలుగేళ్ల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. రెండేళ్ల అతడి చెల్లెలు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైంది. అనంతపురం జిల్లా యాడికి పట్టణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని చెన్నకేశవ కాలనీకి చెందిన రామస్వామి, చాముండేశ్వరి దంపతులకు కుమారుడు రుత్విక్‌ (4), కూతురు యశస్విని ఉన్నారు. ఈ నెల 8న తల్లిదండ్రులు పనులకు వెళ్లేటప్పుడు ఎప్పటిలానే వేడి వేడి టీ ప్లాస్క్‌లో పోసుకుని పక్కన పెట్టారు. ఆ వేడి వేడి టీని పిల్లలిద్దరూ గ్లాస్‌లలోకి ఒంపుకుని తాగారు. దీన్ని కుటుంబ సభ్యులు గమనించలేదు. టీ వేడికి పసివారి గొంతు లోపలిభాగంలో గాయాలయ్యాయి. నొప్పి భరించలేక ఇద్దరూ ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు వారిని తాడిపత్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఒక రోజు చికిత్స చేసిన వైద్యులు, మరుసటి రోజు అనంతపురం వెళ్లాలని సూచించారు. దీంతో చిన్నారులిద్దరినీ గురువారం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రుత్విక్‌ శుక్రవారం తెల్లవారు జామున మృతిచెందాడు. యశస్వినికి చికిత్స కొనసాగుతోంది.

Updated Date - Oct 11 , 2025 | 03:53 AM