Food Distribution Chaos: అన్న సంతర్పణలో తోపులాట
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:07 AM
అన్న సంతర్పణ సమయంలో తోపులాట చోటుచేసుకోవడంతో పక్కనే ఉడుకుతున్న అన్నం గంజిపడి ఇరవై మందికి గాయాలయ్యాయి.....
గంజి పడి 20 మందికి గాయాలు
క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స
మహారాణిపేట (విశాఖపట్నం), అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అన్న సంతర్పణ సమయంలో తోపులాట చోటుచేసుకోవడంతో పక్కనే ఉడుకుతున్న అన్నం గంజిపడి ఇరవై మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని కలెక్టరేట్ జంక్షన్ నుంచి రెల్లివీధికి వెళ్లే రహదారిలో కొత్తజాలరిపేట వద్ద దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భోజనాల కోసం క్యూలైన్‌లో తోపులాట జరగడంతో పక్కనే ఉడుకుతున్న పెద్ద అన్నం గిన్నె ఒలికిపోయింది. అందులోని గంజి క్యూలో ఉన్న పిల్లలు, మహిళలపై పడింది. దీంతో 13 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు గాయపడ్డారు. వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి సూచించారు. కాగా.. చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్‌తో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.