Kadiri Road Accident: ఇద్దరు హాస్టల్ విద్యార్థులకు తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:05 AM
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లి సమీపంలోని ఎస్సీ వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు హాస్టల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
భోజన పాత్రలు ఇవ్వడానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ప్రమాదంపై మంత్రి సవిత సీరియస్
కదిరి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం వడ్డివారిపల్లి సమీపంలోని ఎస్సీ వసతి గృహంలో చదువుతున్న ఇద్దరు హాస్టల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సీ వసతి గృహంలో నరసింహ తొమ్మిదో తరగతి, భార్గవ్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. హాస్టల్ సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ఆదివారం ద్యార్థులకు భోజనం పంపారు. భోజనం అనంతరం పాత్రలు ఇవ్వడానికి హాస్టల్ సిబ్బంది ద్విచక్రవాహనం తీసుకుని నరసింహ, భార్గవ్ బయల్దేరారు. కదిరి-హిందూపురం హైవేకి రాగానే కదిరి వైపు నుంచి ఓబుళదేవరచెరువు వైపు వెళ్తున్న కారు.. విద్యార్థుల ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆంబులెన్స్‌లో కదిరికి తరలించారు. నరసింహ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో హాస్టల్‌లో వార్డెన్ లేకపోవడం గమనార్హం. నరసింహది జిల్లాలోని గోరంట్ల మండలం కమ్మవారిపల్లి. భార్గవ్‌ది నల్లమాడ మండలం బొగ్గులవాండ్లపల్లి.
ప్రమాదంపై మంత్రి సీరియస్
రోడ్డు ప్రమాదంలో హాస్టల్ విద్యార్థులు గాయపడడంపై బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.