Horrific Assault: ఆంధ్రా యువతిపై తమిళ ఖాకీల అత్యాచారం
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:54 AM
ప్రముఖ శైవ క్షేత్రమైన అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం చోటుచేసుకుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఆంధ్రాకు చెందిన ఇద్దరు యువతుల్లో ఒక యువతిపై...
ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం
దర్శనానికి వెళ్తున్న అక్కాచెల్లెళ్లను వాహనంలో నుంచి దింపి బైక్‌పై తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు
అక్కను బెదిరించి చెల్లెలిపై అత్యాచారం
తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ.. నిందితుల అరెస్ట్, రిమాండ్
చెన్నై, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవ క్షేత్రమైన అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం చోటుచేసుకుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఆంధ్రాకు చెందిన ఇద్దరు యువతుల్లో ఒక యువతిపై ఇద్దరు స్థానిక పోలీసులు అత్యాచారానికి తెగబడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై బైపా్‌సరోడ్డులో సోమవారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో తిరువణ్ణామలై వైపునకు లోడుతో వెళుతున్న ఓ వాహనాన్ని ఆపిన కానిస్టేబుళ్లు.. అందులో ఉన్న ఇద్దరు యువతులను కిందికి దించారు. తెలుగులో మాట్లాడుతున్న వీరు అక్కాచెల్లెళ్లు కాగా, ఒకరికి 20, మరొకరికి 18 ఏళ్ల వయసుంటుందని సమాచారం. ఆ వాహనాన్ని అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు తమ ద్విచక్రవాహనాలపై యువతులిద్దరినీ ఎక్కించుకుని సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏందల్ శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అక్కను బెదిరించి పక్కన కూర్చోబెట్టారు. ఆమె చెల్లెలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం రోదిస్తూ కనిపించిన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను గమనించిన స్థానికులు తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి పంపించారు. తన చెల్లిపై జరిగిన దారుణం గురించి అక్కడ తిరువణ్ణామలై పోలీసులకు అక్క ఫిర్యాదు చేసింది. ఈ దారుణంపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. సుందర్, సురేష్‌రాజ్ అనే కానిస్టేబుళ్లను అరెస్టుచేసి, రిమాండ్‌కు తరలించారు.