Share News

ముడా చైర్మన్‌ పదవిపై ఆశలు!

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:11 AM

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌ పదవి కోసం కూటమి పార్టీల నాయకులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

 ముడా చైర్మన్‌ పదవిపై ఆశలు!

- మళ్లీ బీజేపీకే కేటాయించాలని తెరవెనుక ప్రయత్నాలు

- టీడీపీ సీనియర్‌ నాయకుడికే దక్కుతుందని ప్రచారం

- తన కుటుంబానికే ఇవ్వాలని మంత్రి అనుచరుడి డిమాండ్‌

- రేసులో క్రైస్తవ సంఘాల ప్రతినిధి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) చైర్మన్‌ పదవి కోసం కూటమి పార్టీల నాయకులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముడా చైర్మన్‌ పదవిని పొత్తులో భాగంగా గుడివాడకు చెందిన బీజేపీ నాయకుడు మట్టా ప్రసాద్‌కు కేటాయించారు. మచిలీపట్నానికి చెందిన కూటమి నాయకులను కాదని, గుడివాడకు చెందిన ప్రసాద్‌కు ఈ పదవిని కట్టబెట్టడంపై గతంలో కూటమి నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. సీనియర్‌ నాయకులు సర్దిచెప్పడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నవారు మిన్నకుండిపోయారు. స్థానిక నాయకులు, ముడా కార్యాలయ అధికారులు, సిబ్బంది నుంచి సరైన సహకారం అందకపోవడం, రాజకీయ పరమైన కారణాలతో రెండేళ్లు కొనసాగాల్సిన మట్టా ప్రసాద్‌ 11 నెలలకే తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. గత సెప్టెంబరు 9వ తేదీన ప్రసాద్‌ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఇప్పుడైనా మచిలీపట్నానికి చెందిన సీనియర్‌ నాయకులకు ముడా చైర్మన్‌ పదవి ఇవ్వాలనే డిమాండ్‌ ఇటీవల ఊపందుకుంది. టీడీపీలో సీనియర్‌గా ఉన్న ఓ వ్యక్తి పేరును అధిక శాతం మంది నాయకులు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పదవిపై ఆశపెట్టుకున్న గోపువానిపాలేనికి చెందిన టీడీపీలోని యువకుడు తనకు గాని, తన తల్లికి గాని ముడా చైర్మన్‌ పదవిని ఇవ్వాలని గతం నుంచి మంత్రి కొల్లుపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇదే విషయంపై ఇటీవల మంత్రితో మాట్లాడిన సదరు యువకుడికి స్పష్టమైన హామీ లభించకపోవడంతో వాగ్వాదానికి దిగాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల ముందు క్రైస్తవ సంఘాల ప్రతినిధిగా వ్యవహరించిన ఒక పాస్టర్‌ను రాష్ట్రంలోని వివిధ నియోజకవ ర్గాలలో తిప్పి ఓటు బ్యాంకును రాబట్టుకున్నారని, ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పదవిని ఇవ్వాలనే డిమాండ్‌ ఇటీవల కాలంలో ఊపందుకుంది. తమకు న్యాయం చేయకుంటే తమ దారి తాము చూసుకుంటామనే సంకేతాలను వారు పంపుతున్నట్టు సమాచారం.

తెరవెనుక బీజేపీ నాయకుల ప్రయత్నాలు

ముడా చైర్మన్‌ పదవిని మళ్లీ దక్కించుకునేందుకు బీజేపీ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ వద్దకు ఇటీవల జిల్లాకు సరిహద్దున ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ద్వారా వెళ్లి తమ ప్రతిపాదనను తెలియజేశారు. ఢిల్లీ పెద్దల ద్వారా కూడా మంత్రాంగం నడిపేందుకు తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, గతంలో ముడా చైర్మన్‌గా పనిచేసిన మట్టా ప్రసాద్‌ ముడా చైర్మన్‌ హోదాలో తాను పనిచేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ముడాకు చెందిన భూములలో అక్రమ బుసక తవ్వకాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ 13 పేజీల లేఖను ప్రభుత్వం పెద్దలకు ఇచ్చినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 01:11 AM