P4 Scheme Members: జీవితంపై ఆశలు చిగురించాయి
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:04 AM
నాకు చిన్నప్పుడే పెళ్లయింది. కొన్నాళ్లకే భర్త చనిపోయారు. నేను, నా కొడు కు పుట్టింటికి చేరాం. ఇంటర్ వరకు చదివిన నేను కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాను.
పీ4 వేదికపై బంగారు కుటుంబాల భావోద్వేగం
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘నాకు చిన్నప్పుడే పెళ్లయింది. కొన్నాళ్లకే భర్త చనిపోయారు. నేను, నా కొడు కు పుట్టింటికి చేరాం. ఇంటర్ వరకు చదివిన నేను కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాను. అదే సమయంలో పీ4 పథకంలో భాగంగా నన్ను హెచ్‌సీఎల్ కంపెనీ దత్తత తీసుకుని.. డిజిటల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ పూర్తికాగానే నెలకు రూ.15వేల జీతంతో ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంపై ఆశలు చిగురించాయి..’ అని చెబుతూ కృష్ణా జిల్లాకు చెందిన షేక్ పావని పీ4 వేదికపై భావోద్వేగానికి గురయ్యారు. ఆమె గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు చలించిపోయారు. పీ4 పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చెప్పేందుకు పావని మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. జీవితంలో కష్టపడి మరింత ఉన్నతస్థానానికి వెళ్లాలని పావనిని ఆశీర్వదించారు. పావనిని దత్తత తీసుకున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రతినిధి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాము పీ4 కింద 1000 మందిని దత్తత తీసుకున్నామని, 21ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయిమెంట్ స్కిల్ కోర్సును నేర్పించి వారందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పావనికి కూడా ఆ కోర్సు నేర్పించి టెక్నోటాస్క్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించామన్నారు.
కుటుంబ ఆదాయాన్ని పెంచుకున్నా: భవాని
‘నా భర్త అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. సరిపడినంత ఆదాయం వచ్చేది కాదు. నేను టైలరింగ్ నేర్చుకుని కుటుంబానికి చేదోడుగా నిలిచే అవకాశం కల్పించింది పీ4. వాసవ్య మహిళా మండలి వారు కరెంటు కుట్టు మిషన్ ఇచ్చారు’ అని గన్నవరంకు చెందిన భవాని తెలిపింది. ఆమెను దత్తత తీసుకున్న వాసవ్య మహిళా మండలి నిర్వాహకురాలు డాక్టర్ కీర్తి మాట్లాడుతూ.. పీ4 ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
P4 Scheme ఎందరికో స్ఫూర్తి మంత్రం...
పాగాల సుమ అనే విద్యార్థిని పదో తరగతిలో 571 మార్కులు సాధించి ఐఐఐటీలో సీటు తెచ్చుకుంది. డాక్టర్ అవ్వాలన్న సుమ కల సాకారం చేసేందుకు మార్గదర్శిగా రమణయ్య ముందుకు వచ్చారు.
నూజివీడు సీడ్స్ ఆశాప్రియ తమ సంస్థకు చెందిన మండవ ఫౌండేషన్ ద్వారా ఆగిరిపల్లి నుంచి 120 కుటుంబాలను, వారి స్వగ్రామం తుక్కులూరులో 132 కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు.
వినుకొండ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన అబ్బూరి శ్రీనివాస్ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. పీ4 ద్వారా తన గ్రామంలో వ్యవసాయ, విద్యారంగాల్లో అవసరమున్న ఐదు కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు.
సౌదీ అరేబియాలో స్థిరపడిన తెలుగువారు ఖలీద్ సైఫుల్లా ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమేసే పీ4 ఉద్యమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. తాను 15 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చెప్పారు.
అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబానికి ఇచ్చిన సీఎం
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న 250 కుటుంబాల్లో కొందరిని వేదికపైకి తీసుకొచ్చారు. వారితో చంద్రబాబు కాసేపు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో 80వేల కుటుంబాలు ఉంటే 7,900 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి వారి అవసరాలను తీర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కుప్పం నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ వికాస్ వెల్లడించారు. తాను దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలకు సీఎం అడాప్ట్ ట్రీని అందించారు.
ఆలోచన కాదు.. ఆచరణ గొప్పది
ఆలోచన రావడం కాదు దాన్ని ఆచరణలో పెట్టడం అవసరమని మేఘా సంస్థ యజమాని కృష్ణారెడ్డి అన్నారు. ‘నాది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు. మా ఊరిలో ప్రతి ఇంటికి పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చాను. ఊళ్లో 70 శాతం మంది మా సంస్థలో పనిచేస్తున్నారు. మా గ్రామంలో ప్రతి కుటుంబం వద్దకు మా సంస్థ సభ్యులు వెళ్లారు. మా ఊరి వాళ్లు ఎవ్వరూ మాకు ఉచితంగా ఏదీ ఇవ్వమని అడగలేదు. మాకు బతకడానికి మార్గం చూపించమని మాత్రమే కోరారు.’ అని అన్నారు. - మేఘా కృష్ణారెడ్డి
పేదరిక నిర్మూలనకు చిరుప్రయత్నం
పీ4 ఫౌండేషన్ చైర్మన్ కుటుంబరావు మాట్లాడుతూ.. పీ4 అనేది స్వచ్ఛంద కార్యక్రమం. పేద విద్యార్థులకు ట్యూషన్ చెప్పడం కూడా పీ4లో భాగమే. గతంలో దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు గరీబీ హఠావో, రోటీ, కపడా మఖాన్ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. అయినా దేశంలో పేదరికం ఇంకా ఉంది. పీ4 కూడా పేదరికాన్ని రూపుమాపేందుకు ఓ చిన్న ప్రయత్నం మాత్రమే. దీన్ని అందిపుచ్చుకుని కొందరైనా పేదరికం నుంచి బయటకు వస్తారనేది ఈ ప్రభుత్వం ఆశ.
- కుటుంబరావు
మళ్లీ మళ్లీ టీడీపీ రావాలి
2016లో చంద్రబాబు తీసుకొచ్చిన విదేశీ విద్య పథకం ద్వారా రూ.10 లక్షల సాయం తీసుకుని విదేశాలకు వెళ్లి చదువుకుని నేడు ఉన్నతస్థితిలో ఉన్నానని.. ఐర్లాండ్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు సాత్విక్ మురారి అన్నా రు. ‘నేను పొందిన సాయాన్ని తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశం తో ఉన్నప్పుడు పీ4 ప్రారంభించారు. విదేశాల్లో ఉన్న త విద్యనభ్యసించాలనుకునే 10 మంది పేద విద్యార్థులకు పీ4 ద్వారా నేను ఉచితంగా చదివిస్తాను. పీ4 లాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా అమలు కావాలంటే టీడీపీ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి’ అన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకు సంజీవని
భగవంతుడు మనకు ఇచ్చిన ఆయుష్షు 120 ఏళ్లు. దానిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి సంజీవని అనే కార్యక్రమా న్ని చేపట్టబోతున్నాం. ఇప్పటికే కుప్పంలో డీజీ నెర్వ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. త్వరలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా అమలు చేస్తాం.
వెంకన్నకు 121 కిలోల కానుక..
నమ్మకం ద్వారా మనిషి ఏదైనా సాధించగలడు. దానికో ఉదాహరణ చెబుతాను.. ఒక వ్యక్తి వేంకటేశ్వరస్వామి భక్తుడు. కంపెనీ పెట్టి సుమారు రూ.6 వేల కోట్లు సంపాదించారు. ఆయన దేవుడు తనకు ఇచ్చిన దాంట్లో కొంత దేవుడికే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. కంపెనీలో కొంత వాటా విక్రయించగా వచ్చిన సుమారు 140 కోట్లతో 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇస్తున్నారు.