Share News

Nellore Police: హత్యాయత్నం నిందితుల అరెస్టు

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:02 AM

నెల్లూరులో సంచలనంగా మారిన హత్యాయత్నం కేసును సంతపేట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీటీ బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసిన నిందితులను పోలీసులు...

Nellore Police: హత్యాయత్నం నిందితుల అరెస్టు

  • నెల్లూరు రోడ్లపై నడిపించిన పోలీసులు

నెల్లూరు(క్రైం), డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): నెల్లూరులో సంచలనంగా మారిన హత్యాయత్నం కేసును సంతపేట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీటీ బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని నగర రోడ్లపై నడిపిస్తూ తీసుకొని వెళ్లారు. పోలీసు వలయం నడుమ తల వంచుకొని నడుస్తున్న యువకులను చూసిన ప్రజలు... ‘ఇంత చిన్న వియస్సులో అంత విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారా..!’ అంటూ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని బోసుబొమ్మ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం కొందరు యువకులు ఎస్‌ఏఎస్‌ ప్రైవేటు సిటీ బస్సును అడ్డగించారు. బస్సులోని డ్రైవర్‌, కండెక్టర్లపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. సంతపేట పోలీసులు సోమవారం సాంకేతిక ఆధారాలతో వారందరినీ అరెస్టు చేశారు. సంతపేట గోపి టీ సెంటర్‌కు చెందిన ఉప్పు మదన్‌ అలియాస్‌ బాబి, ఉప్పు శ్రీకాంత్‌, నక్క తేజ, సంతపేట మహాలక్ష్మి టెంపుల్‌ వీధికి చెందిన గండవరపు అజయ్‌ తేజ, రాగిచెట్టు సెంటర్‌కు చెందిన యాకసిరి నితిన్‌ స్నేహితులు. ఆదివారం సాయంత్రం ఐదుగురూ బైక్‌లను రోడ్డుకు అడ్డంగా నిలిపి కబుర్లలో పడ్డారు. రోడ్డుపై అడ్డంగా ఉండడంతో సిటీ బస్సు డ్రైవర్‌ మన్సూర్‌ హారన్‌ కొట్టారు. యువకులు పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్‌, కండక్టర్‌ సలామ్‌ వారితో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్‌ ఓ బైకు తాళం తీసుకొని బస్సును ముందుకు కదిలించాడు. ఆగ్రహించిన యువకులు బస్సును బోసు బొమ్మ వద్ద అడ్డుకొన్నారు. డ్రైవర్‌, కండెక్టర్‌పై బ్లేడ్లతో దాడి చేసి పరారయ్యారు. దీనిపై సంతపేట ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్య కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి ముగ్గురిని, సోమవారం మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 06:05 AM