Home Minister Anitha: ఆడపిల్లల జీవితాలతో ఆటలా
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:17 AM
జగన్, వైసీపీ, జగన్ రోత పత్రిక.. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతుందా అని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.
జగన్ మీడియా కథనాలు, వైసీపీ ట్వీట్లపై హోంమంత్రి అనిత ఆగ్రహం
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జగన్, వైసీపీ, జగన్ రోత పత్రిక.. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతుందా అని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కథలల్లేసి, సినిమాలు తీసేస్తున్నారని.. సొంత పేపర్‌లో అబద్ధపు కథనాలు రాస్తున్నారని ఆక్రోశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏలూరులో ఓ వివాహిత తన కుటుంబ సమస్యల కారణంగానో, తనకు ఉన్న అలవాటు వల్లనో మద్యంతాగి, ఆసుపత్రిలో చికిత్స పొందితే.. ప్రైవేటు స్కూల్ బాలికపై లైంగికదాడి అని సాక్షిలో రాశారు. మరుసటిరోజు ఆమె బాలిక కాదని, వివాహిత అని రాశారు. వైసీపీ సోషల్‌మీడియా ఖాతాలో బాలికపై లైంగిక దాడి అని ట్వీట్ చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా జగన్ పత్రిక రాతలు ఉన్నాయి. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులెవరూ చెప్పలేదు. నిర్ధారించలేదు. స్పృహలోకి వచ్చాక ఆమె కూడా ఇదే విషయం చెప్పారు. ఇప్పటి వరకు చావులపై రాజకీయాలు చేస్తున్న జగన్ అండ్‌కో ఇప్పుడు ఆడపిల్లల మానమర్యాదలపైనా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు’ అని అనిత మండిపడ్డారు.