Home Minister Anitha: సైకోల అణచివేతకు చట్టాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 08:17 AM
రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం
అసెంబ్లీలో హోం మంత్రి అనిత వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో శాంతిభద్రతలు లేవు. మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గుచూపింది. సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది’’ అని పేర్కొన్నారు. గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఇప్పటివరకు 40 వేలకు పైగా ఈగల్ క్లబ్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. జాతీయ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో నేరాలు 60 శాతం మేరకు తగ్గాయని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి మొబైల్ యాప్ తీసుకొచ్చామన్నారు. అలాగే న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయని చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని, వారి ఉన్మాదం రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు అడ్డంకిగా మారిందని అనిత మండిపడ్డారు. ఆర్థిక నేరాలు, డిజిటల్ నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ నేతల దుశ్చర్యలను ఉపేక్షించకుండా తగు చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి సూచించారు. బీజేపీ పక్షనేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, వీఆర్‌లో ఉన్నప్పుడు పోలీసు అధికారులకు జీతాలు ఇవ్వడంలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వైసీపీ సైకోల విషయంలో జాప్యమెందుకంటూ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు తమపై కేసులు పెట్టి కొట్టి వేధించిన పోలీసులు ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్నారని.. వారిని బదిలీ చేయాలని హోంమంత్రికి లేఖలిచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. కత్తులతో తమ ఇంటిపైకి దాడికి వచ్చిన వారిపై ఇప్పటికి కేసులు పెట్టలేదని ఎమ్మెల్యే అస్మితరెడ్డి తెలిపారు.
సహనానికి హద్దు ఉంటుంది.. వైసీపీపై యరపతినేని ఫైర్
వైసీపీ హయాంలో రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన సాగిందని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శాంతిభద్రతలపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ... పల్నాడులో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ఉండలేని పరిస్థితిని అప్పటి జగన్ ప్రభుత్వం కల్పించిందన్నారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో దాదాపు 80మంది టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారన్నారు. ‘‘సహనానికి కూడా హద్దు ఉంటుంది. మేమే ఏమైనా చేయగలుగతాం... అని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారు. వాళ్లు ఒకటి చేస్తే మేం పది చేయగలుగుతాం. మాకు ఇక్కడ లక్ష్మణరేఖ ఉంది. సీఎంచంద్రబాబుకే నోటీసు ఇవ్వడానికి సీఐ శంకరయ్యకు ఎంత ధైర్యం’’ అంటూ యరపతినేని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు ఇదే అంశంపై మాట్లాడారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ, యరపతినేని మాటలు తనను కూడా ఆవేదనలోకి నెట్టాయన్నారు. ‘‘సభకు రారు. ఎమ్మెల్యేలను రానివ్వరు. ప్రశ్నలు మాత్రం రోజూ రెండు పంపుతున్నారు. ప్రజలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం నాపై కోర్టుకు వెళ్లారు’’ అని స్పీకర్ తెలిపారు.
‘పదకొండు’పై చలోక్తులు..
ఏపీలో కార్యకర్తలకు తెలంగాణ ఫోన్ నంబర్ ఇచ్చి కర్ణాటకలో జగన్ నివాసముంటున్నారని హోంమంత్రి అనిత అనగా, ఆ ఫోన్ నంబర్‌లోని డిజిట్స్ కూడితే 11 వస్తుందని డిప్యూటీ సీఎం రఘురామ కృష్ణంరాజు చమత్కరించారు. జగన్ గురించి ఈ చర్చ జరిగే సమయం 2:27 నిమిషాలని మరో సభ్యుడు అనగా, ఆ నంబర్లు కూడితే కూడా 11 వస్తుందని... దేవుడి స్ర్కిప్టు అంటూ హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యానించారు. సభలో ఎక్కువ మంది ఆనాడు జగన్ బాధితులేనని, వారి ఫిర్యాదులపై విచారణ చేపడతామని అనిత అనగా, తన కేసును కూడా త్వరితగతిన తేల్చాలని డిప్యూటీ స్పీకర్ కోరారు.