మహిళలకు భద్రత ఉన్నచోటే పెట్టుబడులు: అనిత
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:05 AM
మహిళలకు ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడకు పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీస్ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫిక్కీ ఫ్లో) ఆధ్వర్యంలో హోటల్ గ్రాండ్‌బేలో ‘మహిళల భద్రత, సాధికారత’ అంశంపై బుధవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ‘ఒకవైపు ఇంటిపనులు చక్కబెట్టుకుంటూనే వ్యాపారంలో రాణిస్తున్న మహిళలు సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా దేశంలోనే విశాఖ గుర్తింపు దక్కించుకుంది. మహిళలకు భద్రత ఉండడం వల్లనే విశాఖకు అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నాయి’ అని మంత్రి తెలిపారు. సమావేశంలో ఫిక్కీ ఫ్లో చైర్‌పర్సన్ అమృతాకుమార్, రజినీచిత్ర, హేమ పాల్గొన్నారు.