Home Minister Anita: డ్రగ్స్ తీసుకో బ్రో.. ఇదే జగన్ పార్టీ నినాదం
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:08 AM
నేటి యువతే రేపటి భవిత అని నమ్మిన నేత సీఎం చంద్రబాబు అని, ఆయన నిర్దేశకత్వంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని ప్రజాప్రతినిధులంతా...
యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత మండిపాటు
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నేటి యువతే రేపటి భవిత అని నమ్మిన నేత సీఎం చంద్రబాబు అని, ఆయన నిర్దేశకత్వంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని ప్రజాప్రతినిధులంతా కష్టపడుతుంటే వైసీపీ మాత్రం డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లామని, కానీ వైసీపీ మాత్రం డ్రగ్స్ తీసుకో బ్రో అంటూ యువతను నాశనం చేస్తోందని అన్నారు. తాజాగా వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ దందా నడిపిస్తున్నారని, ఇది జగన్‌కు తెలియకుండా జరుగుతుందా? అని ప్రశ్నించారు. కొండారెడ్డిని సస్పెండ్ చేయాల్సింది పోయి అతనితో మీటింగ్‌లు ఏమిటని నిలదీశారు.