Share News

Home Minister Anita: దళితుల ఇళ్లకు జగన్‌ వెళ్లడు

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:09 AM

మాజీ సీఎం జగన్‌ దళితుల ఇళ్లకు వెళ్లడు. వాళ్లనే తన వద్దకు పిలుపించుకుంటాడు. దళితుడు సింగయ్య జగన్‌ కారు కింద పడి నలిగిపోతే అంబులెన్సులో ఎక్కించకుండా పక్కన పడేశారు.

Home Minister Anita: దళితుల ఇళ్లకు జగన్‌ వెళ్లడు

  • తన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబాన్నీ తన వద్దకే పిలిపించుకున్నాడు

  • వారికి అవమానం జరిగినా స్పందించడు

  • ‘విగ్రహానికి’ నిప్పు కుట్ర వైసీపీదే

  • కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు

  • విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా శిక్షిస్తాం: హోం మంత్రి అనిత

చిత్తూరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్‌ దళితుల ఇళ్లకు వెళ్లడు. వాళ్లనే తన వద్దకు పిలుపించుకుంటాడు. దళితుడు సింగయ్య జగన్‌ కారు కింద పడి నలిగిపోతే అంబులెన్సులో ఎక్కించకుండా పక్కన పడేశారు. కుటుంబ సభ్యులను తన ఆఫీసుకు పిలిపించుకుని వారితో తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. తన హయాంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఏనాడూ జగన్‌ స్పందించలేదు’ అని హోం మంత్రి అనిత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టడమే వైసీపీ పనిగా పెట్టుకుందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో రెండు వారాల క్రితం అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టి, దాన్ని టీడీపీ పైకి నెట్టే రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన వైసీపీ నాయకుల కుట్రను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన సర్పంచ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరోవైపు అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టిన రోజు సాయంత్రమే ఎమ్మెల్యేలు థామస్‌, మురళీమోహన్‌ అక్కడ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం హోం మంత్రి అనిత దేవళంపేటకు వచ్చారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు ఎంఎస్‌ రాజు, థామస్‌, మురళీమోహన్‌, విజయశ్రీలతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడే ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ఇదే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వయసు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదు. ఆయన డిప్యూటీ సీఎంగా చేశారన్నా, నేను హోం మినిస్టర్‌గా పనిచేస్తున్నానన్నా అదంతా అంబేడ్కర్‌ భిక్షే. అలాంటి అంబేడ్కర్‌ విగ్రహాన్ని తగలబెట్టి టీడీపీ మీద నెపం వేసే ప్రయత్నం చేశారు.


15 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు. అలాంటి నాయకుడిని అసెంబ్లీలో అవమానించినా శాంతియుతంగా ధర్నా చేశాం. వైసీపీ తరహాలో కులమత విద్వేషాలను రెచ్చగొట్టలేదు. వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్‌ సుధాకర్‌కు గుండు కొట్టించినప్పుడు, దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసినప్పుడు అప్పటి సీఎం జగన్‌ నోరు విప్పలేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడి కత్తి డ్రామా ఆడి, శీను అనే దళిత యువకుడ్ని ఐదేళ్ల పాటు జైల్లో ఉంచారు. కులమత విద్వేషాలను రెచ్చగొడితే సీఎం చంద్రబాబు ఊరుకోరని చెప్పేందుకే ఇక్కడికి వచ్చాం. వైసీపీ నాయకులు గుళ్ల మీద, మసీదుల మీద, చర్చిల మీద రాజకీయం చేస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అన్నింటినీ అరికట్టేలా ప్రత్యేక చట్టాలను తెచ్చేందుకు సీఎం మాతో ఓ కమిటీ వేశారు. వివేకాకు గొడ్డలిపోటు నుంచి ఈ రోజు వరకు చేస్తున్న అన్ని ఘటనల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అన్నింటినీ అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. విద్వేషాలను రెచ్చగొడితే కఠినంగా శిక్షించేలా చూస్తాం’ అని హెచ్చరించారు. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ మాట్లాడుతూ... ‘వైసీపీ హయాంలో అనేకమంది దళితులకు అవమానాలు జరిగితే ఎస్సీ కోటాలో డిప్యూటీ సీఎం అయిన నారాయణస్వామి ఏనాడూ స్పందించలేదు. లిక్కర్‌ స్కాంలో కోట్లు దోచుకుని ఆయన, ఆయన కూతురు పంచుకున్నారు’ అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ... ‘దేవళంపేటలో విగ్రహానికి నిప్పు అనేది స్థానికంగా రచించిన కుట్ర కాదు. తాడేపల్లె ప్యాలె్‌సలో ప్లాన్‌ చేసిన ఈ కుట్రలో స్థానిక వైసీపీ నాయకులు బలైపోయారు’ అని అన్నారు. వైసీపీ ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని ఎమ్మెల్యే మురళీమోహన్‌ హెచ్చరించారు.

Updated Date - Oct 12 , 2025 | 05:09 AM