History of AP Coins: అణా.. కాణీ.. కహానీ
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:06 AM
క్షణం తీరిక లేదు.. ‘దమ్మిడీ’ ఆదాయం లేదు! వీడు ‘దమ్మిడీ’కి కొరగాడు!చేతిలో చిల్లి ‘గవ్వ’ లేదు! ఆమె పదహారు ‘అణాల’ ఆడపిల్ల!ఇలాంటి వ్యాఖ్యలను వ్యవహారికంగా వింటుంటాం.
గతంలో దమ్మిడీలు, గవ్వలూ డబ్బే
ఇంకా కాణీలు, బేడాలు, అణాలు..
కొన్ని వ్యవహారిక పదాలు వీటిలోంచే
ప్రస్తుతం వాడుకలో లేని నాణేలు ఎన్నో?
(ద్వారకాతిరుమల-ఆంధ్రజ్యోతి)
క్షణం తీరిక లేదు.. ‘దమ్మిడీ’ ఆదాయం లేదు! వీడు ‘దమ్మిడీ’కి కొరగాడు!చేతిలో చిల్లి ‘గవ్వ’ లేదు! ఆమె పదహారు ‘అణాల’ ఆడపిల్ల!ఇలాంటి వ్యాఖ్యలను వ్యవహారికంగా వింటుంటాం. వినడం మినహా ఆ దమ్మిడీలు, గవ్వలు, అణాలు ఏమిటో? ఎలా ఉంటాయో? చాలా మందికి తెలియదు. ప్రస్తుతం మన దేశంలో చలామణి అవుతున్న అతి తక్కువ విలువ ఉన్న నాణెం రూపాయి.కొన్నేళ్లు వెనక్కి వెళ్తే...అర్ధ రూపాయి(50 పైసలు), పావలా(25పైసలు) నాణేలు వాడుకలో ఉండేవి.ఇంకా వెనక్కి వెళ్తే ముందు తరంలో..20, 10, 5 పైసలతో పాటు 2, 1 పైసల నాణేలు కూడా చలామణి అయ్యేవి. ప్రస్తుతమున్న 50-60 ఏళ్ల వయసు వారిలో గుర్తున్న నాణేలు బహుశా ఇవే అయి ఉంటాయి.మరి... అంతకుపూర్వం ఏ నాణేలు వాడుకలో ఉండేవి? అవి ఎన్ని కలిస్తే ఒక్క రూపాయి అవుతుందో మీకు తెలుసా?మనం వినే కొన్ని సామెతలు, వాడుక పదాలు వాటి నుంచే పుట్టాయి. ఒకప్పుడు వాడుకలో ఉన్న దమ్మిడీలు, గవ్వలు,అణాలు తదితర నాణేల గురించి తెలుసుకుందాం.
దమ్మిడి
బ్రిటిష్ కాలంలో దీన్ని వాడేవారు. గతంలో మనదేశంలో ఇంగ్లిష్‌లో దీన్ని ‘పై’ అనేవారట. దీని విలువ చాలా తక్కువగా ఉన్నందుకు.. ‘దమ్మిడీకి పనికి రాడు’,‘నా దగ్గర దమ్మిడీ కూడా లేదు’ వంటి పదాలు పుట్టుకొచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దశాబ్దకాలం వరకూ భారతీయ ద్రవ్య విధానం రూపాయికి 16 అణాల పద్ధతిలో ఉండేది. అంటే... అర్ధ రూపాయికి ఎనిమిది అణాలు,పావలాకు నాలుగు అణాలు అన్నమాట. ఇక ఒక అణా..రెండు పరకలు, నాలుగు కాణీలతో సమానం.అప్పట్లో ఒక పైసా అనేది ఇప్పటి 1.562 నయాపైసలతో సమానమట.అణాలో 12వ వంతు భాగాన్ని దమ్మిడి అనేవారు.అంటే సుమారుగా 192 దమ్మిడీలు కలిస్తే ఒక రూపాయి. అప్పట్లో వంద రూపాయలు అంటే.. చాలా పెద్ద మొత్తం అన్నమాట.
గవ్వలు
గవ్వలు ఇప్పటికీ ఉన్నాయి కానీ డబ్బుల రూపంలో వాడటం లేదు. దీని విలువ కూడా చాలా తక్కువ. అందుకేనేమో డబ్బులు లేకపోతే... చేతిలో చిల్లిగవ్వ లేదు అని అంటుంటారు. అప్పట్లో 768 గవ్వలు కలిస్తే రూపాయి అన్నమాట.

అణా
అణా.. బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు, ఒక అణాకు ఆరు పైసలు ఉండేవి. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో దశాంక విధానం అమలులోకి వచ్చాక రూపాయికి 100 నయాపైసలుగా నిర్ణయించారు. 1964లో నయాపైసాను పైసాగా పేరు మార్చారు.

క్లుప్తంగా..
పూర్వకాలంలో ఒక రూపాయికి 768 గవ్వలు, 384 రోలీలు, 192 దమ్మిడీలు, 128 ఏగాణీలు, 64 కాణీలు, 32 అర్ధ అణాలు, 16 అణాలు, 8 బేడాలుగా చలామణి అయ్యాయి.
20 పైసల నాణేలను 1968లో ముద్రించారు. 1970లో 1, 2, 3 పైసల నాణేలను క్రమంగా తొలగించారు. 1982లో రెండు రూపాయల నోట్ల స్థానంలో కొత్త రెండు రూపాయల నాణెం అందుబాటులోకి వచ్చింది. 2011 జూన్ 30న 25 పైసలు అంతకంటే తక్కువ విలువ కలిగిన నాణేలను రద్దు చేశారు.