Ramachandra Guha: రామచంద్ర గుహకు మహాత్మాగాంధీ సేవా పురస్కారం
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:41 AM
మహాత్మాగాంధీ సేవా పురస్కారానికి కర్ణాటకకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ ఎంపికయ్యారు...
కర్ణాటక ప్రభుత్వం ప్రకటన
బెంగళూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ సేవా పురస్కారానికి కర్ణాటకకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ ఎంపికయ్యారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే పురస్కారాల్లో భాగంగా ఈసారి ఆయనను ఎంపిక చేసింది. సమాచార, పౌరసంబంధాల శాఖ ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. గాంధీజీ జీవిత విలువలను సమాజంలో చాటి చెప్పేవారికి, సంస్థలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దేశ సమకాలీన అంశాలు, చరిత్ర, రాజకీయాలు, పర్యావరణ పరిరక్షణకు పోరాటం, క్రికెట్ తదితర అంశాలపై రామచంద్రగుహ రచనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇండియా ఆఫ్టర్ గాంధీ, భారతీయ క్రికెట్ సామాజిక ఇతిహాసం, గాంధీ జీవిత చరిత్ర రెండో భాగం, ది అన్‌క్వైట్ వుడ్స్ వంటి రచనలు ఎంతో పేరొందాయి. సమాజంలో గాంధీజీ ఆదర్శాలపై రచనలు, అధ్యయనం వంటివి స్ఫూర్తిగా ఉన్నాయని, పురస్కారానికి రామచంద్ర గుహ ఎంపిక సముచితమని సమాచార శాఖ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్ పేర్కొన్నారు.