Share News

ఆయన రూటే సప‘రేటు’!

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:57 AM

విద్యుతశాఖలో ఓ ఉన్నత అధికారి రూటే సప‘రేటు’. ఆయన ధన దాహానికి అంతే లేకుండా పోయింది. అనధికార చేపల చెరువుల నుంచి మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా అక్రమ వసూళ్ల దందా కొనసాగిస్తూనే.. తాజాగా బుడమేరులో చేస్తున్న ఆధునికీకరణ పనుల్లో భాగంగా విద్యుత సరఫరా ఎక్కువ సమయం నిలిపివేయకుండా ఉండేందుకు ఒక్కో చెరువు నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అపార్టుమెంట్లు, పరిశ్రమలు తదితరాలపై అదనపులోడు జరిమానాలు వేయకుండా లక్షల రూపాయల బేరసారాలు నడుపుతున్నట్లు తెలిసింది. ఈయన దెబ్బకు ఇటు ఉద్యోగులు, అటు వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

 ఆయన రూటే సప‘రేటు’!

- విద్యుతశాఖలో అంతు లేని అవినీతి!

- నందివాడ మండలంలో అనధికార చేపలు, రొయ్యల చెరువుల నుంచి అక్రమ వసూళ్లు

- ‘బుడమేరు ఆధునికీకరణ’ వ్యవహారంలో తాజాగా చెరువుకు రూ.2 వేల కప్పం వసూలు

- అదనపులోడు పేరుతో రూ.లక్షల్లో డిమాండ్‌

- నేరుగానే బేరసారాలు.. బెంబేలెత్తిపోతున్న సిబ్బంది, వినియోగదారులు

విద్యుతశాఖలో ఓ ఉన్నత అధికారి రూటే సప‘రేటు’. ఆయన ధన దాహానికి అంతే లేకుండా పోయింది. అనధికార చేపల చెరువుల నుంచి మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా అక్రమ వసూళ్ల దందా కొనసాగిస్తూనే.. తాజాగా బుడమేరులో చేస్తున్న ఆధునికీకరణ పనుల్లో భాగంగా విద్యుత సరఫరా ఎక్కువ సమయం నిలిపివేయకుండా ఉండేందుకు ఒక్కో చెరువు నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అపార్టుమెంట్లు, పరిశ్రమలు తదితరాలపై అదనపులోడు జరిమానాలు వేయకుండా లక్షల రూపాయల బేరసారాలు నడుపుతున్నట్లు తెలిసింది. ఈయన దెబ్బకు ఇటు ఉద్యోగులు, అటు వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

ఆంధ్రజ్యోతి-గుడివాడ:

నందివాడ మండలం కుదరవల్లి- ఇలపర్రు గ్రామాల మధ్యలో బుడమేరు లోపల అక్రమ చెరువులకు విద్యుత కనెక్షన్‌లున్నాయి. ఆధునికీకరణలో భాగంగా పేరుకుపోయిన చెత్త, గుర్రపు డెక్కలను తొలగించాల్సి ఉండటంతో యంత్రాలతో పనులు చేపట్టారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో 11 కేవీ విద్యుత తీగలు అడ్డుగా ఉన్నాయి. తప్పనిసరిగా విద్యుత సరఫరా నిలిపి పనులు చేట్టాల్సి ఉంది. చెరువుల యజమానులతో బేరసారాలు మాట్లాడుకుని రోజుకు రెండు గంటలు మాత్రమే సరఫరా నిలిపేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీని కోసం ప్రతి కనెక్షన్‌కు రూ.2 వేలు చొప్పున కప్పంగా కట్టాలని, లేనిపక్షంలో అక్రమ కనెక్షన్‌లుగా చూపి పీకేస్తానని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఏ రోజుకు ఆ రోజు చెల్లింపులు చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. బుడమేరు లోపల 60కి పైగా ఇటువంటి అక్రమ విద్యుత కనెక్షన్‌లు ఉన్నట్లు సమాచారం.

అదనపు లోడు పేరుతో అడ్డదారులు

ప్రతి మూడు లేదా ఆరు నెలలకు విద్యుత శాఖ అదనపు వినియోగంపై తనిఖీలు చేపడుతుంది. ఈ క్రమంలో సెక్షన్‌ పరిధిలోని భారీ పరిశ్రమలు, అపార్టుమెంట్‌ల్లో అదనంగా లోడ్‌ను వినియోగించుకుంటున్నట్లు గుర్తించారు. అదనపు లోడ్‌ వేయాలని గుర్తించి వారితో బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. తాను సూచించిన విధంగా చెల్లిస్తే తానే అన్ని చూసుకుంటానని, లేని పక్షంలో లక్షలాది రూపాయల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉందని బెదిరించినట్లు సమాచారం.

పేదలపైనా ప్రతాపం!

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేద, మధ్య తరగతి వారికి సైతం వసూళ్ల బెడద తప్పడం లేదు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. ఉన్నతాధికారి నుంచి కిందస్థాయి అధికారి వరకు ఎవరి వాటాలు వారికి అందుతున్నట్లు సమాచారం.

Updated Date - Apr 12 , 2025 | 12:57 AM