Share News

AP Govt: 20 వేల కోట్ల పెట్టుబడులకు హిందూజా సై

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:46 AM

రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు లండన్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

AP Govt: 20 వేల కోట్ల పెట్టుబడులకు హిందూజా సై

  • విశాఖలో విద్యుత్తు కేంద్రం విస్తరణ.. మరో 1600 మెగావాట్ల పెంపు

  • రాయలసీమలో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు

  • మల్లవల్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌

  • లండన్‌లో ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు

  • చంద్రబాబు సమక్షంలో హిందూజా ఒప్పందం

  • రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌, ఆక్టోపస్‌ ఎనర్జీ, శామ్కో హోల్డింగ్‌ ప్రతినిధులతోనూ సీఎం సమావేశం

  • పారిశ్రామికవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ భేటీ

  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు లండన్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం లండన్‌లోని ది లాంగ్లీ, బకింగ్‌హామ్‌షైర్‌లో హిందూజా గ్రూప్‌ చైర్మన్‌ అశోక్‌ హిందూజా, యూరప్‌ వింగ్‌ చైర్మన్‌ ప్రకాశ్‌ హిందూజాతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు. ఈ భేటీలో హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం కుదిరింది. దశలవారీగా రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్‌ నిర్ణయించింది. ఒప్పందంలో భాగంగా.. విశాఖలోని హిందూజా సంస్థకు ప్రస్తుతమున్న 1,050 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ను అదనంగా మరో 1,600 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని పెంచనుంది. ఇక్కడ ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు కొత్త యూనిట్లను స్థాపిస్తుంది. రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పా టు చేస్తుంది. ఆధునిక ఎలక్ట్రిక్‌ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ నెట్‌వర్క్‌ తీసుకురానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపైన హిందూ జా ప్రతినిధులు సంతకాలు చేశారు.


రోల్స్‌ రాయిస్‌కు ఆహ్వానం

ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌, డీజిల్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్స్‌ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రోల్స్‌ రాయిస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సంస్థ సీటీవో నిక్కి గ్రేడి స్మిత్‌తో జరిగిన భేటీలో.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్‌ స్ట్రిప్‌, విమానాల మెయింటెనెన్స్‌, రిపెయిర్‌, ఓవర్‌ హాలింగ్‌(ఎంఆర్‌ఓ) యూనిట్‌ ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఏరో స్పేస్‌ విడిభాగాల ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ, తిరుపతిలో జీసీసీ(గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్‌) ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్‌ ఎకోసిస్టమ్‌, ఎమ్మార్వో ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశముందని వివరించారు.

పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీలు

ఎస్‌ఆర్‌ఏఎం, ఎంఆర్‌ఏఎం గ్రూప్‌ చైర్మన్‌ శైలేశ్‌ హీరానందానీ, శామ్కో హోల్డింగ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ సంపత్‌ కుమార్‌ మల్లాయతో నూ సీఎం సమావేశమయ్యారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. సెమీ కండక్టర్స్‌, ఆధునిక ప్యాకేజింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎస్‌ఆర్‌ఏఎం, ఎంఆర్‌ఏఎం గ్రూప్‌ ఆసక్తి చూపింది. లండన్‌లో అతిపెద్ద విద్యుత్తు సరఫరా సంస్థ ఆక్టోపస్‌ ఎనర్జీ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ క్రిస్‌ ఫిటార్డ్‌తో సీఎం భేటీ అయ్యారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం వారిని ఆహ్వానించారు. క్లీన్‌ ఎనర్జీ, స్మార్ట్‌ గ్రి డ్‌, డేటా అనలిటిక్స్‌లో ఏపీలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు..


టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు

ఏపీలో టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతిలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ వినియోగం, నిపుణులను తయారు చేసే అంశంతోపాటు ఎకో సిస్టమ్‌ అభివృద్ధికి అవకాశాలు పరిశీలించాలని కోరారు. అరుదైన భూగర్భఖనిజాల వెలికితీతపై వివిధ వర్సిటీలతో భాగస్వామ్యం, అవకాశాలు అందిపుచ్చుకొనే ఆస్కారం ఉందన్నారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఏఐ పాలసీ ల్యాబ్స్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ నాగరాజు, ఫ్లుయొంట్‌ గ్రిడ్‌ ప్రెసిడెంట్‌ రత్న గారపాటి, బ్రిటీష్‌ హెల్త్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ప్రతినిధి పాల్‌ బెంటన్‌, ఆరుప్‌ గ్లోబల్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కెన్నీ, అల్తెరిన్‌ టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫ్రెడీ వూలాండ్‌, ఫిడో టెక్‌, ఫిజీ పేపర్‌ కంపెనీ, నేషనల్‌ గ్రాఫైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 05:52 AM