Hilsa Fish: వారెవ్వా పులస
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:02 AM
వర్షాకాలంలో గోదావరికి వరద వచ్చిందంటే చాలు... గోదారోళ్లకు పండగే. వాళ్ల చూపంతా గోదారి మీద ఏటకెళ్లే మత్స్యకారులపైనా, ఆళ్లుపట్టి తెచ్చే పులసపైనే ఉంటుంది.
కేజీ పాతికవేలైనా తగ్గేదేలే
గోదావరిలో మాత్రమే దొరికే స్పెషల్
తొలి వరదల కాలం మూడు నెలలే
ఖండాలు, సంద్రాలు దాటి వచ్చే ఇలస
నలుపిరిగి.. పాలవెండి వర్ణంలోకి
(పోలవరం-ఆంధ్రజ్యోతి)
వర్షాకాలంలో గోదావరికి వరద వచ్చిందంటే చాలు... గోదారోళ్లకు పండగే. వాళ్ల చూపంతా గోదారి మీద ఏటకెళ్లే మత్స్యకారులపైనా, ఆళ్లుపట్టి తెచ్చే పులసపైనే ఉంటుంది. పుస్తెలమ్మైనా సరే పులస కూర తినాలన్న నానుడి గోదారోళ్ల జీవితంతో పెనవేసుకుంది. గోదావరి జిల్లాలో పుట్టాక ఒక్కసారైనా పులస చేప కూర రుచి చూడకపోతే వేస్టంతే అననోళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ పులసకు, గోదారికి ఉన్న బంధమేంటి? చేప కూరలో దీని ప్రత్యేకతేంటి? ఇది ఆసక్తికరమైన చరిత్ర.
రుచి ఒక్కటే... రేటు మాత్రం తేడా
ఇలసలు మన రాష్ట్రలోని అంతర్వేది వద్ద గోదావరిలోకి ప్రవేశించినట్లే... ఒడిశా దుఃఖదాయనిగా పేరుపొందిన మహానదిలోకీ ఈ చేప ప్రయాణిస్తుంది. ఈ రెండు నదుల్లో దొరికే పులస చేప రుచిలో ఎలాంటి తేడా ఉండదు. అయితే ధరలో మాత్రం భారీ వ్యత్యాసమే ఉంది. గోదావరి బంగాళాఖాతంలో కలిసే చోట ఓఎన్‌జీసీ రిగ్గులు వేసింది. దీనివల్ల చేప ప్రయాణ మార్గంలో ఏర్పడే శబ్ద తరంగాల ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. దీంతో గోదారిలోకి ఇలస ప్రయాణం బాగా తగ్గింది. పులస, మత్స్యకారుల వలకు దొరకడమన్నది అదృష్టంగా మారింది. వలకు పులస చిక్కిన రోజు మత్స్యకారులకు పండగే. అందుకే వీటికి రేటెక్కువ. మహానది సముద్రంలో కలిసే పారాదీప్ వద్ద వీటి సంచారానికి ఇబ్బంది కలిగించే నిర్మాణాలేమీ లేవు. అందకనే అక్కడ పులస ఎక్కువగా దొరుకుంది. కేవలం లభ్యత కారణంగానే ధరలో భారీ వ్యత్యాసం ఉంటోంది. సీజన్‌లో డిమాండును బట్టి కిలో పులస రూ.25 వేలు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే.
సంద్రం నుంచి ఏటిలోకి ప్రయాణం..
‘హిల్సా ఇలీషా’ శాస్త్రీయ నామంతో పిలుచుకునే ఈ చేప ఆరోహక వలస జాతికి చెందినది. సముద్రంలో ఉన్నప్పుడు దీనిని ఇలస(విలస) అని పిలుస్తారు. ఇవి సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రం గుండా బంగాళాఖాతంలోకి వస్తాయి. అక్కడినుంచి గోదావరిలోకి, ఒడిశాలోని మహానదిలోకి ప్రవాహానికి ఎదురు ఈదుతుంది. అడవులు, కొండలు, గుట్టలు దాటుకుంటూ ప్రవహించే ఆ నదీ జలాలకు వచ్చే రుచికి ఈ చేప ఫిదా. అందుకే అంతర్వేది వద్ద, పారాదీప్ వద్ద నదుల్లోకి అడుగుపెడుతుంది. జూన్, ఆగస్టు మధ్య గుడ్లు పెట్టడానికి గోదారిలోకి వచ్చి మత్స్యకారుల వలలకు చిక్కుతుంది. గుడ్లు పెట్టిన తరవాత అక్టోబరు నాటికి ఇవి తిరిగి సముద్రం బాట పడతాయి. సముద్రంలో ఉన్నంత సేపూ ఇలస చేప వెన్ను నుంచి తల వరకూ నల్ల రంగులో ఉంటుంది. నదిలో సుమారు 150 నుంచి 250 కిలోమీటర్లు మేర ప్రయాణించే సరికి చేప రంగు పూర్తిగా మారుతుంది. నలుపిరిగి... పాలవెండి వర్ణాన్ని సంతరించుకుంటుంది. రంగుతోపాటే... పేరుకూడా ఇలస నుంచి పులసగా మారుతుంది. అంతేకాదండోయ్... రుచిలోకూడా అనూహ్యమైన మార్పు వస్తుంది.
దీని రుచి అంతా వండడంలోనే...
పులస చేప రుచి అంతా దానిని వండే తీరులోనే అని గోదారోళ్లు గరిటె పట్టి మరీ చెపుతారు. పులస పులుసు పెట్టడానికి... పులస చేప ముక్కలు కిలో, గ్రేడ్ చేసుకున్న 3 ఉల్లిపాయల పేస్టు, చీలికలు చేసిన పది పచ్చిమిర్చి, 6 లేత బెండకాయలు, 2 పెద్ద సైజు నిమ్మకాయలంత చింతపండు గుజ్జు కావాలి. దీనిని కట్టెల పొయ్యిపై, మట్టి పాత్రలో వండితేనే రుచి. బాగు చేసిన చేపల్ని కల్లుప్పుతో కడిగి ముక్కలుగా కోసుకోవాలి. మట్టి పాత్రలో టేబుల్ స్పూన్ నూనె వేసి ఉల్లిపాయల పేస్టు వేసి దోరగా వేగనివ్వాలి. దానికో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కలపాలి. ఆ మిశ్రమాన్ని నూనె తేలేలా వేగనివ్వాలి. అప్పుడు ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 4స్పూన్ల కారం, 1స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ దనియాలు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, చేప ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. నానబెట్టిన చింతపండు పులుసు, నీరు వేసి బాగాకలపాలి. మంట సిమ్‌లో ఉంచి 2 గంటలసేపు మరగనివ్వాలి. పులుసు బాగా మరగడం వల్ల చేపలో ఉండే సన్నని ముళ్లు సైతం ఉడికిపోతాయి. దీనివల్ల ముళ్లు తీయకుండానే నేరుగా తినేయవచ్చు. అంతా అయిపోయిన తరువాత కొత్తిమీర తరుగును పైన చల్లుకోవాలి. దానిని ఒక పూట కదలకుండా ఉంచి, రెండో పూట తింటే... నిజంగానే దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చని అనిపించక మానదు.
