Share News

Anakapalli: హైవే దిగ్బంధం

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:10 AM

మండలంలో బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ 29 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు తన ఉద్యమ పంథాను ఒక్కసారిగా మార్చుకున్నారు.

Anakapalli: హైవే దిగ్బంధం

  • వేడెక్కిన ‘బల్క్‌ డ్రగ్‌ పార్కు’ ఉద్యమం

  • నాలుగు గంటలకుపైగా స్తంభించిన ట్రాఫిక్‌

  • 50 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

  • కలెక్టర్‌, ఎస్పీ హామీలతో ఆందోళన విరమణ

నక్కపల్లి (అనకాపల్లి జిల్లా) అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ 29 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు తన ఉద్యమ పంథాను ఒక్కసారిగా మార్చుకున్నారు. హైకోర్టు అనుమతితో ఆదివారం రాజయ్యపేట రావాల్సిన బీసీవై నేత రామచంద్రయాదవ్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ నక్కపల్లి వద్ద జాతీయ రహదారికి చేరుకుని బైఠాయించారు. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లడానికి వీలుకాకుండా హైవేను దిగ్బంధించారు. బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేయవద్దని, అనుమతులు రద్దు చేయాలని, తమపట్ల దురుసుగా ప్రవర్తించిన అడ్డరోడ్డు సీఐ, నక్కపల్లి ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ వచ్చి, మత్స్యకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ కలెక్టర్‌ వచ్చి తమకు సమాధానం చె ప్పాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సాయంత్రం 5.45 గంటలకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా నక్కపల్లి వచ్చారు. అప్పటికే ఇరువైలా... అటు అన్నవరం, ఇటు తాళ్లపాలెం వరకు సుమారు 50 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. బల్‌ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయవద్దని, తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్న వారిని నిర్బంధించకూడదని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, తమపట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ, ఎస్‌ఐల చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ, ఇప్పటికే నాలుగు గంటల నుంచి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆందోళన విరమించాలని సూచించారు. పోలీసులపై విచారణ చేసి తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బల్‌డ్రగ్‌ పార్కుపై 15వ తేదీన రాజయ్యపేట వచ్చి సమావేశం నిర్వహించి మాట్లాడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆరు గంటల సమయంలో మత్స్యకారులు ఆందోళన విరమించారు.

Updated Date - Oct 13 , 2025 | 05:13 AM