original certificates to students: సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యాసంస్థల గుర్తింపు రద్దు
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:56 AM
విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తే ఆ కాలేజీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ గుర్తింపు రద్దునకు సిఫారసు చేస్తామని ఉన్నత విద్య నియంత్రణ...
రూ.15 లక్షల వరకు జరిమానా కూడా
ఉన్నత విద్యాసంస్థలకు ఉన్నత విద్య కమిషన్ హెచ్చరిక
నిలిపివేసిన సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలని ఆదేశం
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తే ఆ కాలేజీ లేదా ప్రైవేటు యూనివర్సిటీ గుర్తింపు రద్దునకు సిఫారసు చేస్తామని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. అలాగే రూ.15లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలపై అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కమిషన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. కమిషన్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరరావు అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ ఆదేశాలు పంపారు. ‘విద్యార్థుల కోర్సులు పూర్తయినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపడం, విద్యా సంస్థల్లో పనిచేసే ఫ్యాకల్టీ ఒరిజినల్ సర్టిఫెట్లు తీసుకోవడం, ప్రభుత్వం నిర్దేశించినదాని కంటే అదనంగా ఫీజులు వసూలు చేయడం లాంటి ఉల్లంఘనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఫిర్యాదులు అందాయి. విద్యార్థులు, ఫ్యాకల్టీల సర్టిఫికెట్లు నిలిపివేయడం అంటే వారి తదుపరి చదువులు, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయడమే. ఇలాంటి అక్రమాలకు పాల్పడటం శాసనబద్ధమైన నిబంధనలను ఉల్లఘించడమే. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. కనుక నిలిపివేసిన సర్టిఫికెట్లను వెంటనే విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఇవ్వాలి. ఒకవేళ అదనంగా ఫీజులు వసూలు చేసి ఉంటే వాటిని వెంటనే తిరిగి చెల్లించాలి. ఈ నిబంధనలను పాటించకుండా విద్యార్థులను, ఫ్యాకల్టీని ఇబ్బంది పెట్టే విద్యా సంస్థలకు రూ.15లక్షల వరకు జరిమానా తప్పదు’ అని కమిషన్ హెచ్చరించింది. అలాగే ఆ విద్యా సంస్థ అఫిలియేషన్ ఉపంహరణకు, గుర్తింపు రద్దునకు సిఫారసు చేస్తామని స్పష్టంచేసింది. ఇకపై కమిషన్ రెడ్రెసల్ సెల్ నిరంతరం పర్యవేక్షిస్తుందని, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని తెలిపింది.