By Election Race: పులివెందులలో హైవోల్టేజీ
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:14 AM
కడప జిల్లాలో ఉప ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఏడు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు.
జడ్పీటీసీ ఉప ఎన్నిక కాక
అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ
ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు
ఓటుకు 5 వేలు పంచుతున్న వైసీపీ
ఒంటిమిట్టలోనూ హోరాహోరీ
ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం
రేపే పోలింగ్.. భారీ బందోబస్తు
(కడప-ఆంధ్రజ్యోతి)
కడప జిల్లాలో ఉప ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఏడు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. దానినుంచి తేరుకోకముందే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానాలకు 12న జరగనున్న ఉప ఎన్నికలు జగన్ అండ్ కోకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ రెండూ గతంలో వైసీపీ సిటింగ్ స్థానాలే. నోటిఫికేషన్ వెలువడేంత వరకు గెలుపుపై వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే ఇప్పుడు టీడీపీ అనూహ్యంగా పుంజుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇద్దరూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఉప ఎన్నికల పోరు అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గెలుపు కోసం వైసీపీ నేతలు మంచినీళ్ల ప్రాయంలా ఓటుకు నోట్లు వెదజల్లుతున్నారు. మరోవైపు మంత్రులు సవిత, పార్థసారథి, బీసీ జనార్దనరెడ్డి, ఫరూక్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్, కడప జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్టల్లో 700 మంది చొప్పున పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడపలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

పులివెందులలో సీన్ రివర్స్
పులివెందులలో మొత్తం 10,600 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. నోటిఫికేషన్‌కు ముందు వరకూ ఇక్కడ టీడీపీ నామమాత్రంగా ఉండేది. అయితే బీటెక్ రవి సతీమణిని బరిలోకి దించడంతో పాటు వైసీపీ నుంచి కీలక నేతలను పెద్దఎత్తున పార్టీలోకి తెచ్చుకోవడంతో టీడీపీ ఒక్కసారిగా బలం పుంజుకుంది. వైసీపీ తరఫున ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సొంత గడ్డలో వైసీపీ ఇంత విస్తృతంగా ప్రచారం చేయడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఓటమి భయం కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవ్వనంత స్థాయిలో ఇప్పుడు ఓటుకు రూ.5వేలు చొప్పున పంపిణీ చేస్తుండటమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.
ఒంటిమిట్టలో నువ్వా నేనా..
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు మారింది. ఇక్కడ మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిని ఆలస్యంగా ఎంపిక చేశారు. మంత్రుల ప్రచారం కూడా ఆలస్యంగా మొదలైంది. ఒంటిమిట్టలో కూడా వైసీపీ నుంచి పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు ఓటుకు రూ.3వేలు వంతున పంపిణీ చేశారు.