Share News

Jaggampeta: కోటి కూత..

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:11 AM

కాకినాడ జిల్లా జగ్గంపేటలో శుక్రవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు జరిగాయి. ఒక రైతు పొలంలో రాత్రి 9 నుంచి తెల్లవారుజామున...

Jaggampeta: కోటి కూత..

  • జగ్గంపేటలో జోరుగా కోడి పందేలు

  • ఫ్లడ్‌లైట్ల కింద రూ.5- 10 లక్షల వరకు పందేలు

  • వీక్షించేందుకు 100 కార్లలో రాక

  • ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు

కాకినాడ/జగ్గంపేట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేటలో శుక్రవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు జరిగాయి. ఒక రైతు పొలంలో రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 2గంటల వరకు పెద్దఎత్తున పందాలు నిర్వహించారు. సుమారు 20 నుంచి 30 పెద్ద కోడిపుంజులు తీసుకొచ్చి కత్తులు కట్టి బరిలో పందేలు వేశారు. రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు పందేలు కాశారు. దీంతో సుమారు కోటి రూపాయిల పైనే చేతులు మారాయి. పందేల కోసం 100 కార్లలో కృష్ణ, పశ్చిమ, తూర్పు, విశాఖ జిల్లాల నుంచి అనేకమంది వచ్చారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఒక మద్యం సిండికేట్‌ వ్యాపారితో పాటు కొందరు పెద్దల అండదండలతో ఈ పందేలు నిర్వహించినట్టు తెలిసింది. కోడిపందేలు పోలీస్ స్టేషన్‌కు అతి దగ్గరలోనే జరగ్గా, పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. స్థానికుల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో, శనివారం ఉదయం ఆరుగురిని అరెస్ట్‌చేసి.. 3 కోడిపుంజులు, రూ.40,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 28 , 2025 | 04:11 AM