Share News

Visakhapatnam: గుడ్డుకు భలే డిమాండ్‌

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:22 AM

గుడ్డు ధర పరిగెడుతోంది. కొద్దిరోజులుగా మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోగా.. ఇదే సమయంలో తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుడ్ల ఎగుమతికి ఆర్డర్లు వస్తున్నాయి.

Visakhapatnam: గుడ్డుకు భలే డిమాండ్‌

  • స్టాకు లేక పెరుగుతున్న ధరలు

  • తగినంత ఉత్పత్తి లేకపోవడమే కారణం

  • విశాఖలో 100 గుడ్లు (హోల్‌ సేల్‌) 575

విశాఖపట్నం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): గుడ్డు ధర పరిగెడుతోంది. కొద్దిరోజులుగా మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోగా.. ఇదే సమయంలో తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుడ్ల ఎగుమతికి ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో తగినంత స్టాకు లేక ధర పెరుగుతోంది. మంగళవారం విశాఖపట్నంలో 100 గుడ్ల ధరను రూ.575 (హోల్‌సేల్‌)గా నిర్ణయించారు. ఈ ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ 50 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం 46 లక్షల నుంచి 47 లక్షల గుడ్లు వస్తున్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో నెలకొంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధర గిట్టుబాటు కాకపోవడంతో కొందరు రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. చిన్నరైతులు పూర్తిగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్ల పెంపకానికి స్వస్తి చెప్పారు. జూన్‌, జూలై నెలల్లో తీవ్రమైన ఎండలు కాయడంతో ఆ ప్రభావం కోళ్లపై పడింది. వీటన్నింటితో గుడ్ల ఉత్పత్తి తగ్గింది. వర్షాకాలంలో ఉత్తరాది, మధ్య భారతంలో కూరగాయల పంటలు దెబ్బతినడంతో గుడ్ల వినియోగం పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు పెరిగాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో గుడ్డు సరఫరా ప్రారంభించాయి. ఏపీ, తెలంగాణ నుంచి ఆయా రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. ఇలా పలు కారణాలతో స్థానిక మార్కెట్‌లో డిమాండ్‌ రావడంతో ధరలు పెరుగుతున్నాయని అనకాపల్లి జిల్లాకు చెందిన పౌల్ర్టీ రైతు ఒకరు చెప్పారు. మార్కెట్‌ డిమాండ్‌కు తగినంత సరఫరా జరిగేంత వరకు గుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 06:24 AM