High Court: ఉల్లంఘనలు ఉపేక్షించం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:08 AM
అధికార విధుల్లో ఉండగా చట్టనిబంధనలను తు.చ. తప్పకుండా అనుసరించాల్సిందేనని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.
పోలీసులకు హైకోర్టు హెచ్చరిక
కోర్టులతో ఎలా మెలగాలో వారికి చెప్పండి
హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి నిర్దేశించిన ధర్మాసనం
27న హోం ముఖ్యకార్యదర్శి హాజరుకు ఆదేశం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): అధికార విధుల్లో ఉండగా చట్టనిబంధనలను తు.చ. తప్పకుండా అనుసరించాల్సిందేనని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది. కోర్టులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ఎలా మెలగాలో పోలీసు సిబ్బందికి సూచనలు చేయాలని.. విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నానని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. తదుపరి విచారణ రోజు తమ ముందు హాజరుకావాలని ఆయనకు స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్సై పోస్టుల భర్తీ నిమిత్తం 2018 నవంబరు 1న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్‌కు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ ట్రాన్స్‌జెండర్ గంగాభవాని 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పున కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సాల్మన్‌రాజు వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ పురుషుడిగా జన్మించారని, తర్వాత లింగమార్పిడి ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారారని తెలిపారు. ఎస్సై ఉద్యోగం దరఖాస్తులో స్త్రీ, పురుష ఐచ్ఛికం మాత్రమే ఇవ్వడంతో పిటిషనర్ స్త్రీగా ఐచ్ఛికాన్ని ఇచ్చారని, ప్రాథమిక పరీక్ష రాసి బీసీ రిజర్వేషన్ కోటాలో 35 మార్కులు సాధించారని పేర్కొన్నారు. అయితే అధికారులు తర్వాతి ప్రక్రియను అనుమతించలేదని తెలిపారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ 2022 జనవరి 21న తీర్పు ఇవ్వగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ 2022లో ధర్మాసనం ముందు గంగాభవాని అప్పీల్ వేశారు.
ఈ అప్పీల్‌పై గతేడాది డిసెంబరు 12న విచారణ జరిపిన ధర్మాసనం...రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో నవంబరు 22న నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా గంగాభవాని ఉద్యోగంపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నెల 6న అప్పీల్ మరోసారి విచారణకు రాగా...హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ నివేదిక సమర్పించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 13న నేరుగా తమ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. అప్పీల్ సోమవారం మరోసారి విచారణకు రాగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ.... విశ్వజిత్ సెలవులో ఉన్నారని, తన అభ్యర్థన మేరకు ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారని తెలిపారు. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విశ్వజిత్ బదులు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విచారణకు హాజరయ్యారన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.