Share News

High Court order: కోర్టులను తేలిగ్గా తీసుకోవద్దు!

ABN , Publish Date - Sep 16 , 2025 | 03:50 AM

సర్వశిక్షా అభియాన్‌ పథకం కింద నడిచే విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించే వ్యవహారంపై తమ వైఖరి తెలియజేస్తూ కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య...

High Court order: కోర్టులను తేలిగ్గా తీసుకోవద్దు!

  • ప్రమాణ పూర్వక అఫిడవిట్‌ దాఖలు చేయండి

  • విఫలమైతే మాముందు హాజరుకండి

  • కేంద్ర మానవవనరుల కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

  • సర్వశిక్షా పథకం బోధనా సిబ్బంది వ్యవహారం

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): సర్వశిక్షా అభియాన్‌ పథకం కింద నడిచే విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించే వ్యవహారంపై తమ వైఖరి తెలియజేస్తూ కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టులను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ నాటికి ప్రమాణ పూర్వక అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇరువురు అధికారులకూ స్పష్టం చేసింది. విఫలమైతే వివరణ ఇచ్చేందుకు నేరుగా తమ ముందు హాజరుకావాలని తేల్చిచెప్పింది. అప్పీల్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 22కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీలు)గా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాల్‌ చస్తూ 2023లో కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. పిటిషనర్లను ఉద్యోగాల్లో నుంచి తొలగించడాన్ని తప్పుబట్టారు. వారిని కొనసాగించాలని స్పష్టం చేశారు. ఒప్పందం ముగిసిన అనంతరం కూడా పిటిషనర్లను పీజీటీలుగా కొనసాగించే విషయాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ 2023 డిసెంబరు 5న తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ అధికారులు 2024 జనవరిలో ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఇటీవల విచారణకు రాగా.. శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బందిని నియమించకుండా విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించే వ్యవహారంపై వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా కేంద్రం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, రాష్ట్ర విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జి.రామచంద్రరావు స్పందిస్తూ.. అఫిడవిట్ల దాఖలుకు మరికొంత సమయమివ్వాలని కోరారు. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా తీరిక లేకుండా ఉండడంతో అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోయామని ఏఎస్‌జీ అన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము ఖాళీగా ఉండడం లేదని, బిజీగానే ఉంటున్నామని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది.

Updated Date - Sep 16 , 2025 | 03:50 AM