High Court: రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:16 AM
తిరుమల పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్, అతడి కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఆస్తులను...
పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు
అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్, అతడి కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఆస్తులను వేరొకరి పేరు మీదకు బదలాయించారా అనే అంశాలపై దర్యాప్తు చేసి మధ్యంతర నివేదికను ఏసీబీ డీజీ సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు సమర్పించారు. నివేదిక పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 5కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. పరకామణి చోరీ ఘటన పై ఇప్పటికే చాలా వరకు దర్యాప్తు పూర్తయిందని, కొన్ని అంశాలపైనే దర్యాప్తు మిగిలి ఉందని గుర్తు చేశారు. ఇందులో వేర్వేరు అంశాలు ఇమిడి ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బహుశా మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించారు.
ఇదీ కేసు..
పరకామణి చోరీ కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ వద్ద ఏవీఎ్‌సవో వై.సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన సీవీ రవికుమార్, అతడి కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు వారు ఆ ఆస్తులను ఆదాయానికి తగ్గట్లే ఆర్జించారా? ఆస్తులను వేరొకరి పేరు మీద బదలాయించారా? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. ఏసీబీ తరఫున న్యాయవాది శ్యాంసుందర్‌రావు స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించామన్నారు. సీఐడీ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజి వాదనలు వినిపించారు.