Share News

AP High Court: పీపీపీతో తప్పేంటి

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:28 AM

రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆస్పత్రులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పేముందని...

AP High Court: పీపీపీతో తప్పేంటి

  • నిధుల్లేనప్పుడు మెడికల్‌ కాలేజీలు కట్టాలంటే ఏళ్లు పడుతుంది

  • డబ్బుల్లేకనే ప్రభుత్వ-ప్రైవేటు పద్ధతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు

  • పాలనా అనుమతులివ్వగానే సరా?

  • కాలేజీల నిర్మాణానికి నిధులేవీ?

  • డబ్బు కొరతతో జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణమూ ఆగిపోయింది

  • కట్టితీరాలని సర్కారుపై ఒత్తిడి తేలేం కదా!

  • టెండర్ల ఖరారుపై స్టే విధించలేం

  • మధ్యంతర ఉత్తర్వులివ్వలేం: హైకోర్టు

అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 10 మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆస్పత్రులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. నిధుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని వ్యాఖ్యానించింది. నిధులు లేనప్పుడు కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణం ప్రభుత్వమే చేయాలంటే ఏళ్లు పడుతుందని పేర్కొంది. నిధుల కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)నో, మరొకరినో ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపింది. నిధుల లేమి కారణంగా జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం సైతం ఆగిపోయిందని గుర్తు చేసింది. నిధుల లభ్యత లేనప్పుడు కోర్టు భవనాలు కట్టితీరాలని తాము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేం కదా అని ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని.. లేకుంటే ప్రభుత్వ కాలేజీలు, ఆస్పత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని పేర్కొంది. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపింది. ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసింది. పీపీపీలో ఆస్పత్రుల అభివృద్ధికి పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న సీఎస్‌, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఎంఎ్‌సఐడీసీ ఎండీ, ఏపీఎంఈఆర్‌సీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.


ఇదీ కేసు..

ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల 9న రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త కుర్రా వసుంధర పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం ధర్మాసనం ముందు విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. 2024 సెప్టెంబరులోనే కాలేజీల నిర్మాణం నిలుపుదలకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. నిధుల కొరత ఉందని ఎక్కడా చెప్పడం లేదన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో 12 కాలేజీల నిర్మాణానికి రూ.5,008 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. పీపీపీ విధానంలో ఆస్పత్రుల అభివృద్ధికి పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా స్టే ఇవ్వండి’ అని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘కాలేజీ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులిస్తే సరిపోతుందా? సరిపడా నిధులేవీ? టెండర్లు ఖరారు చేయకుండా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేం’ అని తేల్చిచెప్పింది.

Updated Date - Oct 09 , 2025 | 03:29 AM