Share News

High Court: సాక్షి చానల్‌పై తదుపరి చర్యలు నిలుపుదల

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:29 AM

సాక్షి చానల్‌ వేదికగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్య లు చేసిన వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు నమో దు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సాక్షి టీవీ పూర్తిస్థాయి డైరెక్టర్‌ రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.

High Court: సాక్షి చానల్‌పై తదుపరి చర్యలు నిలుపుదల

  • అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల

  • కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సాక్షి చానల్‌ వేదికగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్య లు చేసిన వ్యవహారంలో తుళ్లూరు పోలీసులు నమో దు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సాక్షి టీవీ పూర్తిస్థాయి డైరెక్టర్‌ రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. కేసు ఆధారంగా సాక్షి చానల్‌ యాజమాన్యంపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ విచారణను జూలై 24కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ‘అమరావతి దేవతల రాజధాని కాదు-వేశ్యల రాజధాని’ అంటూ సాక్షి చానల్‌ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో అమరావతి దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.


సాక్షి చానల్‌ యాజమాన్యాన్ని కేసులో ఏ3గా చేర్చారు. ఈ కేసును కొట్టివేయాలని రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్‌ కృష్ణంరాజు వ్యాఖ్యలకు సాక్షి యాజమాన్యాన్ని బాధ్యులను చేయడం సరికాదన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు టీవీ యాజమాన్యానికి వర్తించవన్నారు. నేరాన్ని నిరూపించేందుకు ఆధారాలు సమర్పించాలని నిందితుడిని పోలీసులు కోరడం సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమన్నారు. పోలీసుల తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పాణి సోమయాజి వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, దర్యాప్తునకు సహకరించాలంటూ సాక్షి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 06:36 AM