Share News

Liquor Scam: ఆ ముగ్గురికి డీఫాల్ట్‌ బెయిల్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:50 AM

మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందనప్పలకు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరుచేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన...

Liquor Scam: ఆ ముగ్గురికి డీఫాల్ట్‌ బెయిల్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

  • ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లోని పలు అంశాలపై స్టే

  • మద్యం నిందితులపై చార్జిషీట్లను తప్పుబడుతూ ఇచ్చిన ఆఫీస్‌ మెమోరాండం అమలు నిలుపుదల

  • ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీకి నోటీసులు

  • వీరి బెయిల్‌ రద్దు కోసం వ్యాజ్యం వేసిన సీఐడీ

  • ఎల్లుండికి తదుపరి విచారణ వాయిదా

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందనప్పలకు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరుచేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సీఐడీ దాఖలుచేసిన చార్జిషీట్లపై ఆగస్టు 23న పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆఫీస్‌ మెమోరాండంతోపాటు బెయిల్‌ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాలపై స్టే విధించింది. నిందితులు ఇప్పటికే బెయిల్‌ పై విడుదలైన నేపధ్యంలో వారికి నోటీసులు ఇచ్చి వాదన వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వారు ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడు బూనేటి చాణిక్య(ఏ8) వేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నిలువరించాలని సీఐడీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. చాణిక్యకు నోటీసులు జారీ చేసింది. ఈ నాలుగు వ్యాజ్యాలపై తదుపరి విచారణను సెప్టెంబరు 11కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సిట్‌ దాఖలు చేసిన చార్జిషీట్‌, సప్లిమెంటరీ చార్జిషీట్‌ అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో మద్యం కుంభకోణం కేసు నిందితులు ధనుంజయ్‌రెడ్డి(ఏ31), కృష్ణమోహన్‌రెడ్డి(ఏ32), బాలాజీ గోవిందప్ప(ఏ33)లకు ఏసీబీ కోర్టు ఈ నెల 6న పొరపాటున డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘‘చట్టనిబంధనల మేరకు నిర్దిష్ట గడువులోగా ప్రాధమిక చార్జిషీట్‌ దాఖలు చేశాం.


తదనంతరం సప్లిమెంటరీ చార్జిషీట్‌ కూడా వేశాం. సీఐడీ దాఖలుచేసిన చార్జిషీట్లలో 21 అభ్యంతరాలను లేవనెత్తుతూ ఏసీబీ కోర్టు ఆఫీస్‌ మెమోరాండం జారీ చేసింది. ఆ మెమోరాండంలో లేవనెత్తిన అభ్యంతరాల సమాచారమంతా ఏసీబీ కోర్టు ముందు అందుబాటులో ఉంది. డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరుకు సంబంధించి రీతు చాబ్రియా వర్సెస్‌ యునియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకొని ఏసీబీకోర్టు నిందితులకు డీఫాల్ట్‌ బెయిల్‌ మం జూరు చేసింది. ప్రస్తుత కేసుకు ఆ ఉత్తర్వులు వర్తించవు. చార్జిషీట్‌ దాఖలు చేసిన అనంతరం సీఆర్పీసీ సెక్షన్‌ 309 కింద నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కో ర్టు ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది. నిందితుల కు డీఫాల్ట్‌ బెయిల్‌ పొందే వీలులేకుండా చేసేందు కు చార్జిషీట్‌ దాఖలు చేశామా? లేదా బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్‌ 187 ప్రకారం నిర్దిష్ట గడువులోగా చార్జిషీట్‌ వేశామా? అనే విషయంపై లోతైన విచారణ అవస రం. ఈ నేపధ్యంలో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన అంశాలపై స్టే విధించాలి.’’ అని వారు కోరారు. ఈ వివరాలు పరిగణనలో కి తీసుకున్న న్యాయమూర్తి... సీఆర్పీసీ సెక్షన్‌ 309 కింద నిందితులకు రిమాండ్‌ పొడిగించినప్పుడు సీఆర్పీసీ సెక్షన్‌ 167 కింద డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు అంశం ఉత్ప న్నం కాదు కదా అని వ్యాఖ్యానించారు. నిందితులకు నోటీసులు జారీచేశారు.


దిలీప్‌ బెయిల్‌ రద్దు చేయండి..

మద్యం కుంభకోణం వ్యవహారంలో నిందితుడు, రాజ్‌ కసిరెడ్డి(ఏ1) అనుచరుడు పైలా దిలీప్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 28న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసింది. కోర్టు ముందున్న ఆధారాలను, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని పేర్కొంది. ‘‘ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డితో కలిసి ఆర్థిక లావాదేవీలు జరపడంలో దిలీప్‌ది కీలకపాత్ర. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంతో దిలీప్‌ది ముఖ్యపాత్ర. మద్యం కుంభకోణం కేసు నమోదైన తరువాత దిలీప్‌ మొత్తం 51 ఎకరాలు అమ్మారు. ‘సిట్‌’ ఏర్పాటైన అనంతరం ఒక్క మార్చి నెలలోనే 42 ఎకరాలు విక్రయించారు. దిలీప్‌ బెయిల్‌ పై ఉంటే ముడుపుల రూపంలో వచ్చిన సొమ్ముతో ఇతర నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించడం కష్టమవుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దిలీప్‌ బెయిల్‌ను రద్దు చేయండి.’’ అని పిటిషన్‌లో కోరారు.

Updated Date - Sep 09 , 2025 | 05:00 AM