Share News

High Court: జడ్జీల కళ్లకు గంతలేమీ లేవు

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:23 AM

ఓ భవన నిర్మాణం విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక శాఖ అధికారులపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది.

High Court: జడ్జీల కళ్లకు గంతలేమీ లేవు

  • వాణిజ్య నిర్మాణాన్ని నివాస గృహంగా చెబుతారా? కోర్టును తప్పుదారి పట్టిస్తారా? : హైకోర్టు ఆగ్రహం

  • గత భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌పై ఫైర్‌

  • రూ. 2.5 లక్షలు చెల్లించాలని ఆదేశం

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఓ భవన నిర్మాణం విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక శాఖ అధికారులపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉండవచ్చు కానీ.. న్యాయమూర్తులకు కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాణిజ్య అవసరాల కోసం నిర్మాణం చేపడుతున్నా, నివాస గృహంగా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన అప్పటి భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణ ఫోటోలను పరిశీలిస్తే.. సామాన్యులకు సైతం అది వాణిజ్య అవసరాల కోసం నిర్మాణం చేస్తున్నట్లు అర్థమవుతుందని పేర్కొంది. మున్సిపల్‌ కమిషనర్‌ కోర్టును తప్పుదోవ పట్టించేలా నివేదించారని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిపిన మణిమంజరి, నరసింహారావులకు రూ.50 వేలు మాత్రమే సింగిల్‌ జడ్జి ఖర్చులు విధించారని, ఆ సొమ్మును రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఖర్చుల కింద రూ.2.5 లక్షలు చెల్లించాలని కమిషనర్‌ను ఆదేశించింది. భవన నిర్మాణం చేసిన యజమానులకు మరో రూ.2.5 లక్షలు ఖర్చులు విధించింది. సొమ్మును హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద జమ చేయాలని వారిని ఆదేశించింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఆ సొమ్మును అంధులు, మూగవారి కోసం వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.


కేసు వివరాలు ఇవీ..

భీమవరం పట్టణంలోని సర్వేనెం.99/5, 99/6లో ఓ నివాస భవనం (గ్రౌండ్‌ ప్లస్‌1) నిర్మాణం కోసం 2022 ఫిబ్రవరిలో మున్సిపల్‌ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే నివాస గృహానికి బదులు షాపింగ్‌మాల్‌/గోదాం తరహా నిర్మాణం చేపడుతున్నారని దండు శ్రీనివాసకుమార్‌ వర్మ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్‌ వినతిని పరిగణలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని మున్సిపల్‌ కమిషనర్‌ ఆ వినతిని పరిష్కరించారు. కమిషనర్‌ ఉత్తర్వులతో పాటు నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ మరికొందరు కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మణి మంజరి, సీహెచ్‌వీ నరసింహారావు మరో పిటిషన్‌ వేశారు. రికార్డులు పరిశీలించిన సింగిల్‌ జడ్జి.. నివాస భవనానికి అనుమతి తీసుకొని, వాణిజ్య భవనాన్ని నిర్మించారని నిర్ధారించారు. అయితే నిర్మాణం ఉన్న ప్రాంతాన్ని 2024 జనవరిలో నివాస జోన్‌ నుండి వాణిజ్య జోన్‌గా మార్చిన నేపథ్యంలో వాణిజ్య భవనం నిర్మాణానికి ఏలూరు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఇచ్చిన అనుమతికి చట్టబద్ధత ఉందని స్పష్టత ఇచ్చింది. వాస్తవాలు వెల్లడించకుండా నివాస నిర్మాణంగా చూపించేందుకు ప్రయత్నించిన మణి మంజరి, నరసింహారావులకు రూ.50 వేలు ఖర్చులు విధించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దండు శ్రీనివాసకుమార్‌ ద్విసభ్య బెంచ్‌ముందు అప్పీల్‌ వేశారు. వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగా అధికారులు వాణిజ్య నిర్మాణానికి అనుమతులు ఇచ్చి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. వాణిజ్య నిర్మాణం కోసం ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ 2024 జూన్‌ 19న అనుమతులు ఇచ్చిందని గుర్తుచేసింది. ఆ అనుమతులను రద్దు చేయడం లేదని తెలిపింది.

Updated Date - Dec 28 , 2025 | 05:24 AM