Share News

High Court: కౌంటర్‌ దాఖలుకు ఎనిమిదేళ్లా

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:15 AM

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఒక సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో 8 సంవత్సరాల పాటు పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై...

High Court: కౌంటర్‌ దాఖలుకు ఎనిమిదేళ్లా

  • కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులకు లెక్కలేదు

  • సివిల్‌ కేసులో ధర్మవరం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఒక సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో 8 సంవత్సరాల పాటు పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు శుక్రవారం మండిపడింది. కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా పోలీసులకు లెక్కలేదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యమే ఉండేదని, ఇప్పుడు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎనిమిదేళ్ల పాటు కేసును పక్కన పడేసి, ఇప్పుడు కౌంటర్‌ వేస్తాం... అనుమతించాలని కోరడం ఏంటి?’ అని నిలదీసింది. ఇలాగే వదిలేస్తే ‘ఏళ్ల తరబడి కౌంటర్‌ వేయకున్నా ఏమీ కాదులే..‘ అనే ధోరణి పోలీసుల్లో పెరిగిపోతుందని, ప్రజల్లో కోర్టుల పట్ల నమ్మకం పోతుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం రిట్‌ దాఖలైన 180 రోజుల్లో కౌంటర్‌ వేయాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ఈ అసాధారణ జ్యాప్యానికి ఖర్చులు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. కౌంటర్‌ దాఖలుకు అనుమతిచ్చేందుకు రూ.10 వేలు ఖర్చులు కింద చెల్లించాలని ధర్మవరం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌కు స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా సొమ్మును ఏపీ హైకోర్టు క్లర్క్స్‌ అసోసియేషన్‌ వద్ద జమ చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ ఉత్తర్వులు ఇచ్చారు.


అసలు ఏంటి కేసు..?

అనంతపురం జిల్లా ధర్మవరంలోని పాత బస్టాండ్‌ వద్ద తనకున్న రెండు షాపులను ఖాళీ చేయాలని సీఐ, ఎస్‌ఐ ఒత్తిడి చేస్తున్నారని, వారిని నిలువరించాలని కోరుతూ రాజశేఖర్‌ అనే వ్యక్తి 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు పలుమార్లు వాయిదాలు కోరారు. ఈ కేసు ఇటీవల విచారణకు రాగా.. ధర్మవరం వన్‌టౌన్‌ సీఐ నాగేంద్ర కోర్టు ముందు హాజరయ్యారు. లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజశేఖర్‌పై కేసు నమోదు చేశామని 2017లో చెప్పిన పోలీసులు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించారు. రాజశేఖర్‌ వేసిన రిట్‌ పిటిషన్‌తో పాటు సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ రెండూ శుక్రవారం విచారణకు వచ్చాయి.

Updated Date - Oct 18 , 2025 | 05:16 AM