Share News

High Court: దేవ్‌జీ, రాజిరెడ్డి పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాల్లేవు

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:57 AM

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డిలను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ...

High Court: దేవ్‌జీ, రాజిరెడ్డి పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాల్లేవు

  • వారు తమ వద్ద ఉన్నారని ఉన్నతాధికారులు చెప్పలేదు

  • అందుచేత జోక్యం చేసుకోలేం: హైకోర్టు

  • ఆధారాలు లభిస్తే కోర్టుకు రావచ్చంటూ పిటిషనర్లకు వెసులుబాటు

అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డిలను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసివేసింది. వీరిద్దరూ పోలీసుల నిర్బంధంలో ఉన్నారని నిరూపించేందుకు ప్రాథమిక ఆధారాలు లేనందున ప్రస్తుత వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆధారాలు లభిస్తే కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ జి.తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవ్‌జీ, రాజిరెడ్డిలను కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవ్‌జీ తమ్ముడు తిప్పిరి గంగాధర్‌,రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌వేశారు. దీనిపై గురువారం విచారణకు జరిపిన ధర్మాసనం.. వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారని నిరూపించే ఆధారాలుంంటే.. కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను ఆదేశించింది. శుక్రవారం వ్యాజ్యం మరోసారి విచారణకురాగా పిటిషనర్ల తరఫు న్యాయవాది యు.జైభీమారావు వాదనలు వినిపించారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు, చానళ్లలో ప్రసారమైన వీడియోలను పెన్‌డ్రైవ్‌లో కోర్టు ముందు ఉంచామని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్‌ వీడియోను కోర్టు పరిశీలనకు ఉంచామని .పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ అన్నారు. ముఖ్య నేతల భద్రతాసిబ్బంది 9మంది అదుపులో ఉన్నారని పోలీసులు చెప్పారు తప్ప దేవ్‌జీ, రాజిరెడ్డి గురించి ప్రస్తావించనేలేదన్నారు. వీడియోలను పరిశీలించిన ధర్మాసనం కూడా ఇదే నిర్ధారించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

Updated Date - Nov 22 , 2025 | 05:59 AM