Share News

High Court: విశాఖలో ఐటీ భవనాల నిర్మాణానికి ఎందరు దరఖాస్తు చేశారు

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:57 AM

విశాఖపట్నం మధురవాడలోని ఐటీ హిల్‌-3 వద్ద ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు...

High Court: విశాఖలో ఐటీ భవనాల నిర్మాణానికి ఎందరు దరఖాస్తు చేశారు

  • భూకేటాయింపు విధానం ఏంటి?

  • పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • రహేజాకు నిధులివ్వకుండా నిలువరించాలన్న పిటిషనర్‌ అభ్యర్థన తోసివేత

  • విచారణ రెండు వారాలకు వాయిదా

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మధురవాడలోని ఐటీ హిల్‌-3 వద్ద ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు రహేజా కార్పొరేషన్‌కు 27.10 ఎకరాలను కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టు కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? భూకేటాయింపులో అనుసరిస్తున్న విధానం ఏమిటో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం రహేజా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు విడుదల చేయబోతోందని, ప్రక్రియను నిలువరించాలన్న సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్‌ హబ్స్‌(ఎల్‌ఐఎఫ్‌టీ) పాలసీలో భాగంగా రహేజా కార్పొరేషన్‌కు 27.10 ఎకరాలను కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ ‘సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ కాన్‌స్టిట్యూషనల్‌ రైట్స్‌’ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున పొన్నవోలు వాదనలు వినిపించారు. రహేజాకు భూకేటాయింపు లిఫ్ట్‌ పాలసీ నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. లిఫ్ట్‌ పాలసీని సవాల్‌ చేస్తూ ఇప్పటికే ఓ పిల్‌ దాఖలైందని.. ప్రస్తుత పిల్‌లో పాలసీతో పాటు రహేజా సంస్థకు భూకేటాయింపునూ సవాల్‌ చేశారని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి భూకేటాయింపు చేశామన్న వాదనలో వాస్తవం లేదన్నారు. 15 వేల ఉద్యోగాలు కల్పించాలనే షరతుతోనే భూమి కేటాయించామని.. రహేజాకు విధించిన షరతులను పిటిషనర్‌ ఉద్దేశపూర్వకంగా కోర్టు ముందు ఉంచడం లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

Updated Date - Dec 18 , 2025 | 04:58 AM